ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో భేటీకానున్నారు. అపాయింట్‌మెంట్‌ల సమయాన్ని బట్టి అదేరోజు, లేని పక్షంలో మరుసటి రోజున సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రానున్నారు.బుధవారం పర్యటనపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ క్రమంలో కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న ఇళ్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో గురువారం ముఖ్యమంత్రి పాల్గొంటారని ముందుగా నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఉన్నట్టుండి వాయిదా వేశారు. ఆ రోజున ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనుండటంతో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు.
ఈ పర్యటనలో ప్రధానంగా ఏపీలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. విభజన హామీలను ప్రస్తావించే అవకాశం ఉంది. అంతేకాదు స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత తొలిసారి జగన్ హస్తిన వెళ్తున్నారు. వాస్తవానికి గత నెల 12న లండన్ యాత్ర ముగించుకుని వచ్చిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. ప్రధాని అందుబాటులో లేకపోవడంతో పర్యటన వాయిదా పడింది.గత నెల 21 నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత వరుస సెలవులు వచ్చాయి. 6, 7 తేదీల్లో ప్రధాని ఢిల్లీలోనే ఉంటారని.. అందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నారు. సీఎం జగన్ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, టీడీపీ జనసేన పొత్తు అంశాలు కూడా ప్రధాని దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది.