ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం.. ప్రస్తుతం వైసీపీకి కంచుకోట. ఆ నియోజకవర్గంలో జగన్ బొమ్మతో గెలిచేయొచ్చు అనే టాక్ ఉంది. అలాంటి నియోజకవర్గంలో వర్గపోరు ఇప్పుడు పార్టీకి సమస్యగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా.. ఎంపీ కోటగిరి శ్రీధర్ మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఎలక్షన్ దగ్గర మొదలైన వర్గపోరు.. మొన్న మండల పార్టీ ప్రెసిడెంట్ల నియామకం వరకు కొనసాగింది. ఇంకా ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందో కూడా చెప్పలేదని పరిస్థితి నెలకొంది. దీంతో నియోజకవర్గంలో క్యాడర్ అయోమయంలో పడిపోయిందనే టాక్ నడుస్తుంది.
ఏలూరు ఎంపీ శ్రీధర్ స్వగ్రామం ఈస్ట్ ఎడవల్లి. ఇది చింతలపూడి నియోజకవర్గంలోనే ఉంది. దీంతో ఆయన తన కుటుంబం పట్టు కొనసాగించేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. తన వర్గం కోసం.. వారికి పదవులు ఇప్పించడం కోసం.. పార్టీ పెద్దల దగ్గర లాబియింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటు ఎమ్మెల్యే ఎలీజా కూడా జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ సమస్య రోజురోజుకు ముదురుతోంది.
వాస్తవానికి ప్రస్తుత ఎంపీ కోటగిరి శ్రీధర్ 2024 ఎన్నికల్లో పోటీ చేయబోనని బహిరంగంగానే ప్రకటించారు. కానీ.. చింతలపూడి, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌గా ప్రకటించాలని పార్టీ హైకమాండ్‌ను కోరారు. అందుకు అధిష్ఠానం అంగీకరించలేదనే టాక్ వినిపిస్తోంది. కానీ.. శ్రీధర్ మాత్రం పట్టు వదలడం లేదు. ఎలాగైనా తన వర్గం ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నామినేటెడ్ పోస్టుల విషయంలో సాధ్యమైనంత వరకూ పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆయన డిమాండ్లను పెండింగ్‌లో పెట్టిందని తెలుస్తోంది.
అయితే.. ఇన్నాళ్లు పరిస్థితి ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. కొందరు స్థానికంగా ఉండే అగ్ర కులాల నాయకులు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాపై పగ పెంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ఎమ్మెల్యేలతో ఎప్పుడూ మీటింగ్ పెట్టినా.. ఎలీజాకు ఈసారి టికెట్ రాదని ఆయన ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. దీన్ని ఎమ్మెల్యే వర్గం తిప్పికొడుతోంది.
ఈ ఇద్దరు నేతల మధ్య పోరు ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో ప్రజలు మాత్రం జగన్‌కు మొగ్గు చూపుతున్నారు. ఇటు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో.. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న వర్గపోరును పరిష్కరించాలని.. ఈ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి పోటీ చేస్తే.. ప్రతిపక్షాల నుంచి కనీసం పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని అంటున్నారు. చూడాలి మరీ.. చింతలపూడి విషయంలో పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో!