ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతుంది.... పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 11:58 PM

పథకాల నిధుల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ విమర్శించారు. జగన్‌ది రూపాయి పావలా ప్రభుత్వమని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతుందని పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా పెడనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఓట్లు వేయించుకునేందుకే వైసీపీ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని, అమలుకు వచ్చేసరికి మాత్రం అంతా డొల్లతనమే అన్నారు. పథకాల నిధుల మళ్లింపులో ఏపీదే అగ్రస్థానమని కేంద్రం చెప్పిందన్నారు. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చిన రూ.337 కోట్లలో రూ.6.22 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, మిగతా నిధులను జగన్ మళ్లించారన్నారు.


జగన్ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్టను కొట్టిందని మండిపడ్డారు. సగానికి పైగా ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారన్నారు. మనలో విభేదాలు పాలసీల వరకే పరిమితం చేసుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి అందరం ఒకటి కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల తర్వాత జనసేన, టీడీపీ ప్రభుత్వం రానుందన్నారు. రాష్ట్రంలో చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, సభ పెట్టాలంటే ప్రత్యేక అనుమతులు, రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే వీసా తీసుకునే పరిస్థితి నెలకొందన్నారు.


వైసీపీ దాష్టీకానికి జనసైనికులు, ఈ నేల తాలూకు పౌరుషం చూపించారని, ఇక్కడ అక్రమ మట్టి తవ్వకాలు చేస్తుంటే జనసైనికులు అడ్డుకుంటే వారిని అంబేద్కర్ విగ్రహానికి కట్టేసి కొట్టారన్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధుల ఇంటి ముందు నుంచి వెళ్లాలన్నా జనసైనికులు నమస్కారం పెట్టి వెళ్లాలనే నిబంధనలు ఉన్నాయని తెలిసిందని, వాటిని తీసేద్దామన్నారు. ఏపీ విభజన జరిగిన సమయంలో మాజీ మంత్రి కొనకళ్ల నారాయణపై దాడి జరిగిందని, దీనిని తాను మరిచిపోలేనన్నారు. 2014లో రాష్ట్రం కోసం టీడీపీ, బీజేపీ కూటమికి తాను మద్దతు పలికానని, ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా మరోసారి టీడీపీతో కలిసి వస్తున్నామన్నారు.  అక్రమ తవ్వకాలను అడ్డుకుంటే అక్రమ కేసులు, హత్యా కేసులు పెడుతున్నారన్నారు. ఈ జగన్ అనే దుష్టవ్యక్తి, అన్యాయంగా కేసులు పెట్టించారని, మర్దర్లు చేసిన వారిని గద్దెనెక్కించిన మీకు లేని భయం, దేశంకోసం ప్రాణ త్యాగాలు చేయడానికి సిద్దంగా ఉన్న తాను ఎందుకు భయపడతానన్నారు. ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నింటా అవినీతికి పాల్పడ్డారన్నారు.


పండగలు వస్తున్నాయి, పోతున్నాయి కానీ జగన్ చెప్పిన 28 లక్షల ఇళ్లు ఎక్కడ ఉన్నాయో, ఏమయ్యాయో తెలియదన్నారు. జగనన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదని, రాష్ట్రానికి వచ్చిన విపత్తు అని మండిపడ్డారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి దగ్గర దేహీ అని అడుక్కునే పరిస్థితి రాకూడదని, అందుకు తనను తిట్టిన వారితోనూ చేయి కలిపేందుకు సిద్ధంగానే ఉన్నానన్నారు. కనీసం రాజధాని కూడా సాధించుకోలేకపోయామని, ఇలానే ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించాలన్నారు.


మూడు నెలలు కర్రసాము నేర్చుకుని మూలనున్న ముసలమ్మను కొట్టినట్లు, 151 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు ఉంటే రాష్ట్రం కోసం పోరాడకుండా, వచ్చి మాపై దాడులు చేస్తావా? అని ప్రశ్నించారు. జగన్ దగ్గర పావలా దమ్ము కూడా లేదని, కనీసం పార్లమెంట్‌లో గళం ఎత్తలేదని, ఆ రోజు సోనియాగాంధీకి కనిపించకుండా మూలకు వెళ్లి ప్లకార్డ్ పట్టుకున్నాడన్నారు. కేంద్రం వద్దకు వెళ్లి కేసులు లేకుండా చేయాలని అక్కడకు వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నారన్నారు.


తాను ఎవరినీ కులాల వారిగా చూడనని, అందరూ తన వాళ్ళేనని, ప్రజలను కులాల వారీగా విభజించే సంస్కృతిని తాను తీసేస్తున్నానని చెప్పారు. తనను కులం చూసి ఎవరూ అభిమానించలేదని, తానూ అలా చూడనని చెప్పారు. తనను కుల నాయకులతో విమర్శలు చేయించే చచ్చు సలహాలు తన వద్ద పని చేయవన్నారు. చేనేతకు అండగా ఉంటే ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్నారు. 


జగన్‌ది కుటుంబ పాలన, అందరూ వారి కుటుంబ సభ్యులు, బంధువులే, వారు కాకుండా ఇతర కులస్తులతో తిట్టిస్తారు, కులాల మధ్య గొడవలు సృష్టిస్తారని ఆరోపించారు. ఒక ప్రజా కంఠకుడిపై మనమంతా కలిసి పోరాటం చేయాలి, భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. టీడీపీ బలహీనంగా ఉన్న సమయంలో చంద్రబాబు అనుభవానికి జనసేన బలం తోడైతే వైసీపీని భూస్థాపితం చేయవచ్చునని చెప్పారు. మోపిదేవి సుబ్రమణ్యస్వామి ఆశీస్సులతో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అని పిలుపునిచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa