ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి, ఫలితాలు అందించడానికి కేంద్రం సహకరించాలని కోరారు. గురువారం సాయంత్రం సీఎం వైయస్ జగన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రజలకు ప్రాజెక్టు ఫలితాలు అందించడానికి సహకరించాలని కోరారు. పూర్తి నిర్మాణ వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాలన్నారు.