వైసీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వెళ్లి వారి దీవెనలు కోరే ముందుగా మండల స్థాయి నాయకత్వంతో ఈనెల 9వతేదీన విజయవాడలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలో శుక్రవారం తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులు మాత్రమే హాజరు కానున్నట్లు స్పష్టం చేశారు. మండలపార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ, ఎంపీపీలు, పార్టీ పరమైన పదవులలో ఉన్నవారు, పార్టీ అనుబంధ సంఘాలు, మార్కెట్ యార్డు ఛైర్మన్లు తదితరులు దాదాపు 8 వేలమందికి పైగా హాజరవుతారన్నారు. ఇది పూర్తిగా ఆహ్వానితులతోనే జరుగుతున్న సమావేశమని, బహిరంగ సభ కాదని, ముఖ్యంగా ఓపెన్ టూ ఆల్ కాదని గమనించాలని కోరారు. ఈ సమావేశంలో మండల స్థాయిలో సంస్థాగతంగా అన్ని రకాలుగా లీడ్ చేయగలిగిన లీడర్‌షిప్‌తో ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ ఉంటుందన్నారు. స్థానిక సంస్థలలో దాదాపు 80 శాతం గెలిచినందున ఆ నాయకత్వం అంతా హాజరవుతారన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, అర్బన్ మండలాలకు సంబంధించి కూడా సమావేశంలో పాల్గొంటారన్నారు.