స్విస్ బ్యాంకు. ప్రపంచ దేశాల్లోని చాలా మంది తాము అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బునంతా ఈ బ్యాంకులో డిపాజిట్లు చేస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు దాచుకునేందుకు స్విస్ బ్యాంక్ అనుమతినిస్తుండటంతో దేశవిదేశాల్లోని ధనవంతులు తమ సొమ్మును అందులో దాచుకుంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు స్విస్ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారి వివరాలు బయటికి వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రభుత్వానికి మరో జాబితా చిక్కింది. ఇప్పటివరకు 4 జాబితాలు భారత్ చేతుల్లో ఉండగా.. ఇప్పుడు ఐదో జాబితా కూడా అందింది. ఇందులో బిజినెస్‌మెన్‌లు, కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన వందల అకౌంట్ల వివరాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
స్విస్ బ్యాంకులో అకౌంట్లు తెరిచిన భారతీయులు, భారత్‌కు చెందిన సంస్థల ఐదో లిస్ట్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్దకు చేరింది. సమాచార మార్పిడి ఒప్పందంలో భాగంగా బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన ఐదో జాబితాను స్విట్జర్లాండ్ ప్రభుత్వం భారత్‌కు అందించింది. ఇందులో బిజినెస్‌మెన్‌లు, ట్రస్టులు, కార్పొరేట్‌లకు చెందిన వందలాది ఖాతాల వివరాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ లిస్ట్‌లో మొత్తం 104 దేశాలకు చెందిన 36 లక్షల స్విస్ అకౌంట్ల వివరాలు ఉన్నాయని తెలిపారు. అకౌంట్ తెరిచిన వారి పేరు, అడ్రెస్, అకౌంట్ నంబర్, ఫైనాన్షియల్ డేటా, వారి అడ్రస్, ట్యాక్స్ నంబర్ సహా కీలక విషయాలు ఆ లిస్ట్‌లో ఉన్నట్లు తెలిసింది.
ఇక ఆ లిస్ట్‌లో ఉన్న సంస్థల పేరు, వాటి ఖాతాల్లో ఉన్న డబ్బు, అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న వివరాలను స్విట్జర్లాండ్ వెల్లడించింది. అయితే ఆయా అకౌంట్లలో మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. డేటా ఎక్స్ఛేంజ్ అగ్రిమెంట్‌లోని ప్రైవసీ నిబంధనను పాటిస్తూ.. ఆ తర్వాతి పరిశోధనలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ లిస్ట్ ఆధారంగా భారత్‌లోని పలు దర్యాప్తు సంస్థలు మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల సేకరణ, పన్ను ఎగవేతలు, ఇతర నేరాల విచారణలను చేపట్టనున్నారు. ఈ లిస్ట్‌ను ఇన్‌కం ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేయనున్నారు. అయితే ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులలో ఆ మొత్తాలను పొందుపరిచారా అనే విషయాన్ని పరిశీలించనున్నారు.
అయితే స్విస్ బ్యాంకు అకౌంట్ హోల్డర్ల లిస్ట్‌ను భారత్‌తో పంచుకోవడంపై స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్ఛేంజ్ గ్లోబల్ స్టాండర్డ్ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగానే సమాచారా మార్పిడి జరిగినట్లు వెల్లడించింది. 104 దేశాలకు ఈ లిస్ట్‌ను షేర్ చేసినట్లు తెలిపింది. ఈ ఏడాది కజక్‌స్థాన్, మాల్దీవులు, ఒమన్ దేశాల సమాచారాన్ని అంతకుముందు విడుదల చేసిన 101 దేశాల జాబితాలో కలిపారు. దీంతో ఆర్థిక ఖాతాల సంఖ్య దాదాపు 2 లక్షలు పెరిగింది. ఇక ఆరో జాబితాను 2024 సెప్టెంబరులో విడుదల చేస్తామని స్విస్ అధికారులు పేర్కొన్నారు.