ప్రపంచంలోనే అత్యంత పటిష్ట నిఘా వ్యవస్థల్లో ఒకటైన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌పై ప్రస్తుతం ఎన్నో ఆందోళనలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఎంతో విస్తృతమైన నిఘా వ్యవస్థ ఉన్నా ఇంతటి విధ్వంసాన్ని ఎందుకు ముందే గుర్తించలేదు.. ఒకవేళ గుర్తించినా వాటిని తిప్పికొట్టే సామర్థ్యం ఉన్నా ఎందుకు ఫెయిల్ అయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దాడులు ఒకవైపు అయితే హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి అకృత్యాలకు పాల్పడటం, ఇజ్రాయెల్ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టడంతో అసలు ఇజ్రాయెల్ నిఘా, రక్షణ వ్యవస్థపై తీవ్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
వందల మంది హమాస్ ఉగ్రవాదులు.. ఆయుధాలు, వాహనాలతో ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ మధ్య ఉన్న పటిష్టమైన రక్షణ కంచెను కూల్చేసి చొరబడ్డారు. ఓ వైపు వాయు మార్గంలో రాకెట్లను పంపిస్తూనే మరోవైపు.. ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించగలిగారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్ బెట్, ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ మొసాద్, ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) ఈ దాడులను అంచనా వేయలేకపోవడం తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే వారికి ముందే తెలిసినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలం అయ్యారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) దేశాల్లో అత్యంత పటిష్టమైన నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం అనేది ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థకు ఎలాంటి సమయంలో కూడా నిధుల కొరత కూడా ఉండదు. వీటికి తోడు పాలస్తీనియన్ మిలిటెంట్ల గ్రూపుల్లోనూ, లెబనాన్, సిరియా, ఇంకా ఇతర దేశాల్లో ఇజ్రాయెల్ ఏజెంట్లు రహస్యంగా పనిచేస్తూ ఉంటారు. ఇజ్రాయెల్‌పై వారు చేసే కుట్రలు, దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఇన్ఫార్మర్లు కూడా ఉన్నారు. గతంలో ఇంటెలిజెన్స్ సాయంతో దాడులను ముందే పసిగట్టి.. సరైన సమయంలో సరైన దాడులు చేసి ప్రత్యర్థులను చిత్తు చేసిన చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ గతంలో మిలిటెంట్ నేతల కదలికల గురించి పక్కా సమాచారం తెలుసుకుని, సరైన సమయంలో దాడులు చేసి వారిని అంతం చేసింది. అలాంటిది సరిహద్దున ఉన్న గాజా స్ట్రిప్ నుంచి దాడులు చేస్తున్నా ఎందుకు ఆపలేకపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇరాన్‌ను ఎదుర్కోవడంలో, ఇరాన్ చేసే అణు కార్యక్రమాన్ని విఫలం చేసే ప్రయత్నాల్లో మునిగిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే తన సరిహద్దుల్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇజ్రాయెల్ నిర్లక్ష్యం చేసిందని నిపుణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతటి భద్రత, నిఘా వ్యవస్థ ఉన్న ఇజ్రాయెల్‌లో.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, పోలీసులు, భద్రత, నిఘా వ్యవస్థ ఎక్కడికి వెళ్లాయని ఇజ్రాయెల్ పౌరులు ప్రశ్నిస్తున్నారని.. ఇజ్రాయెల్ నేవీ మాజీ చీఫ్ ఎలి మారన్ విమర్శించారు. ఇది భారీ వైఫల్యం అని పేర్కొన్నారు.