గాజా స్ట్రిప్ నుంచి హమాస్ ఉగ్రవాదులు.. మెరుపు దాడులకు పాల్పడిన తర్వాత ఇజ్రాయేల్-పాలస్తీనా సరిహద్దుల్లో భీకర పోరు కొనసాగుతోంది. ఇజ్రాయేల్ దళాలు, హమాస్ మధ్య జరుగుతోన్న పరస్పర దాడుల్లో ఇప్పటికే ఇరువైపులా భారీ ప్రాణనష్టం సంభవించింది. ఇజ్రాయెల్, గాజాల్లో కలిపి మృతుల సంఖ్య 1,100 దాటినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ మిలిటెంట్ల దుశ్చర్యలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. హమాస్‌ను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) ఉగ్రవాదుల కంటే క్రూరమైందని ఇజ్రాయేల్ పేర్కొంది.
హమాస్‌పై యుద్ధం ప్రకటించినట్లు ఇజ్రాయేల్ ప్రభుత్వం అధికారికంగా ఆదివారం వెల్లడించింది. శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ఇప్పటికే హెచ్చరించారు. హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడుల్లో ఇజ్రాయేల్‌లో మరణాల సంఖ్య 600కు చేరుకుందని స్థానిక మీడియా పేర్కొంది. దశాబ్దాలుగా జరుగుతోన్న దాడుల్లో ఈ స్థాయి ప్రాణనష్టం జరగడం ఇదే మొదటిసారి. గాజాలోనూ 370 మందికి పైగా మృతిచెందినట్టు పాలస్తీనా అధికారులు తెలిపారు. వేలాది మంది పౌరులు గాయపడ్డారు.
ఇజ్రాయేల్ ఆర్మీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఇది మా 9/11.. అంతకంటే ఎక్కువ.. మా దేశాన్ని నాశనం చేయాలని హమాస్ భావిస్తోంది’ అని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ దాడిని ‘ఇజ్రాయెల్ చరిత్రలో అమాయక పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన ఊచకోత’గా అభివర్ణించాయి. తీవ్రవాద సమూహాన్ని ఐఎస్ కంటే అనాగరిక, క్రూరమైంది అని పేర్కొన్నాయి. ‘హమాస్ ఐఎస్ కంటే అనాగరికమైంది.. క్రూరమైంది. హమాస్ వందలాది మంది ఇజ్రాయెల్‌లు.. పురుషులు, స్త్రీలు, పిల్లలను హత్య చేసింది.. గాజాలోకి డజన్ల కొద్దీ బందీలను తీసుకుంది. ఈ భయంకరమైన ఉగ్రవాద చర్యకు తగిన ప్రతిస్పందనను కోరుతుంది.. ఇది ఖచ్చితంగా మేము బదులు తీర్చుకుంటాం’ అని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన తాజా ప్రకటనలో తెలిపింది. మరోవైపు, పరిస్థితులపై ఇజ్రాయేల్ పొరుగు దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్ అధినేతలు ఫోన్‌లో సంభాషించారు. పరిస్థితులు మరింత దిగజారకుండా పనిచేయాలని ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్‌సీసీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 అంగీకరించినట్లు ఓ ప్రకటన పేర్కొంది. ఈ రెండూ అమెరికాకు మిత్రదేశాలు కాగా... ఇజ్రాయేల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్న మొదటి అరబ్ దేశాలు. దక్షిణ గాజాలోని రఫా పట్టణంపై ఇజ్రాయేల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇక్కడి శాబౌరా శరణార్థుల శిబిరంపై జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 19 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈజిప్టు సరిహద్దు సమీప ప్రాంతంలో భారీ పేలుడు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. మరోవైపు, ఇజ్రాయేల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను పంపింది.