ఏపీలో మహిళాసాధికారత పూర్తిస్థాయిలో జరుగుతోందని మంత్రి ఉషశ్రీ చరణ్ వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తగా టీడీపీతో జత కట్టలేదని, ఆయన ఎప్పుడూ ఆదే పార్టీతో ఉన్నారని అన్నారు. ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఆమె మాట్లాడుతూ... ఏపీలో మహిళాసాధికారత పూర్తిస్థాయిలో జరుగుతోందన్నారు. మహిళలకు ఏపీలో పూర్తిస్థాయి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ ప్రభావం, వారాహి యాత్ర ప్రభావం ఏమాత్రం ఉండదని జోస్యం చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీకి అలవాటే అన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాలకు గాను అన్నింటా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. టీడీపీ, జనసేనతో పాటు మరెన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీయే గెలుస్తుందన్నారు.