అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. తాజాగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల 11న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే పునీత్ సీఐడీ నోటీసులను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ కోరారు. ఏపీ హైకోర్టు ఆ పిటిషన్‌పై విచారణ జరపనుంది.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో ఐదుగుర్ని నిందితులుగా చేరుస్తూ సీఐడీ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పినారాయణ సతీమణి రమాదేవి (ఏ15), బావమరిది రాపూరి సాంబశివరావు (ఏ16), రమాదేవి కజిన్ అయిన ఆవుల మునిశేఖర్ (ఏ17), ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగిని పొత్తూరి ప్రమీల (ఏ18), కొత్తాపు వరుణ్‌కుమార్ (ఏ19)లను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు.
ఈ కేసులో వారి ప్రమేయానికి సంబంధించిన వివరాలతో మెమో దాఖలు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా గతేడాది మే 9న సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి పి నారాయణ, లింగమనేని రమేష్‌లు కూడా నిందితులుగా ఉండగా.. నారా లోకేష్‌ను ఏ14గా చేర్చి.. నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఆయన సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.