టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా.. ముందేగానే తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు ఈ విచారణ కొనసాగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హెరిటేజ్ సంస్థ భూముల కొనుగోళ్లపై సీఐడీ లోకేష్‌ను ప్రధానంగా ప్రశ్నించనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ లోకేష్‌కు ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసింది.హెరిటేజ్ సంస్థకు లబ్ధిచేకూరేలా ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్ మార్చారని సీఐడీ ప్రధనంగా అభియోగాలు మోపింది. దీనిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన ఈనెల 4న హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత న్యాయస్థానం సీఐడికి కీలకమైన ఆదేశాలు జారీచేసింది.
విచారణ సమయంలో లోకేష్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫలానా డాక్యుమెంట్లు తీసుకుని రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే విచారణ చేయాలని.. మధ్యాహ్నం ఓ గంట భోజన విరామం ఇవ్వాలని సీఐడిని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు 41 కింద నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని సూచించింది. విచారణకు సహకరించాలని లోకేష్‌కు సూచించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు.