కుప్పంలో సోషల్ మీడియా పోస్టుపై దుమారం రేగింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ కుప్పంలో తెలుగు మహిళలు వినూత్నంగా నిరసనను తెలియజేశారు... కాళికా దేవి, ఆదిశక్తి, గ్రామ దేవతల వేషాలు వేసుకుని చేతిలో కర్పూరం వెలిగించి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిన వారిని కఠినంగా శిక్షించాలని శపించారు. రాష్ట్రంలో రాక్షస సంహారం ఖచ్చితంగా జరుగుతుంది అన్నారు. అయితే ఈ నిరసనను ఉద్దేశించి చేసిన పోస్ట్‌పై తెలుగు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మహిళలు చేసిన నిరసన వీడియోలతో పాటు వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ భరత్ పేరుతో ఉన్న ఓ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టుపై తెలుగు మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టిన ఎమ్మెల్సీ భరత్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ కుప్పం నియోజకవర్గ తెలుగు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ భరత్ కుటుంబంలోని మహిళలు ఇలాగే చేస్తే వారు తాగి చిందులేసినట్లేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్సీ ఇంటిని ముట్టడిస్తారని హెచ్చరించారు. ఆ పోస్టులో.. ‘కుప్పంలో చంద్రబాబు కోసం ఆదిపరాశక్తి అవతారం ఎత్తిన కుప్పం బిడ్డలు, పెయిడ్ ఆర్టిస్టులు తాగిన మత్తులో ఏ విధంగా ఊగుతున్నారో చూడండి’ అంటూ ఎమ్మెల్సీ భరత్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు రావడంతో ఈ వివాదం రేగింది. ఇదిలా ఉంటే ఈ పోస్టు వ్యవహారంపై ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. భరత్‌కు సంబంధించినట్లు చెబుతున్న ఆ ఫేస్‌బుక్ ఖాతా నకిలీదని, ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.