విశాఖలో దారుణం జరిగింది. ఆకలేస్తోందని బయటకు వచ్చిన యువతిని ఊహించని రీతిలో మృత్యువు వెంటాడింది. కుటుంబానికి చేదోడుగా ఉంటున్న యువతి మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. నంద్యాలకు చెందిన ముల్లా షహీద కుటుంబం ఉపాధి కోసం విశాఖ వలస వచ్చారు. ఆమె తల్లిదండ్రులు పెందుర్తి గాంధీనగర్‌లో నివాసం ఉంటూ తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి ఒక్కగానొక్క కుమార్తె షహీద స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. సోమవారం పాఠశాలకు వెళ్లిన ఆమె ఒక విద్యార్థి భోజనం తీసుకురాకపోవడంతో తన భోజనాన్ని ఆ విద్యార్థికి ఇచ్చేశారు.
సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఆకలి వేయడంతో ఆమె ఇంటికి సమీపంలో ఉన్న ఓ బండి దగ్గర పునుగులు తిన్నారు. అనంతరం నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా పెందుర్తి పోలీస్‌స్టేషన్ వైపు నుంచి కూడలి వైపు బీఆర్టీఎస్ మధ్యలో అతి వేగంగా వస్తున్ బైక్ ఆమెను ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆమె కాలు విరిగిపోగా, చేతికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో 108 వాహనంలో కేజీహెచ్‌కు తరలించే ప్రయత్నంచారు. కానీ రక్తస్రావం కావడంతో మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన యువకుడు రవితేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒక్కగానొక్క కూతురు ఇలా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.