కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. మహిష దసరా ఉత్సవాలు జరిపేందుకు కొన్ని వర్గాలు సిద్ధం అవుతుండగా.. వాటిని వ్యతిరేకిస్తూ బీజేపీ రంగంలోకి దిగింది. మహిష దసరా ఉత్సవాలకు వ్యతిరేకంగా మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే మహిష దసరా ఉత్సవాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు. దీంతో మరో వివాదం ముసురుకుంది. కర్ణాటకలోని మైసూరులో అక్టోబరు 13 వ తేదీ నుంచి మహిష దసరా ఉత్సవాలు జరగనున్నాయి. అయితే తేదీ దగ్గర పడుతున్న కొద్ది వివాదాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మహిష దసరా ఉత్సవాలను నిర్వహించవద్దని బీజేపీ సహా పలు హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ మహిష దసరా ఉత్సవాలను వ్యతిరేకిస్తూ.. బీజేపీ నాయకులు ఛలో చాముండి బెట్ట కార్యక్రమానికి తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉద్రిక్తతలు మరోస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అటు మహిష దసరా ఉత్సవాలకు, ఇటు ఛలో చాముండి బెట్ట కార్యక్రమానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
దసరా ఉత్సవాల నేపథ్యంలో సాంస్కృతిక నగరమైన మైసూర్ అందంగా ముస్తాబైంది. ప్యాలెస్ భవనంలో నూతన బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే మహిష దసరా వేడుకలను వ్యతిరేకిస్తూ స్నేహ మహికృష్ణ అనే వ్యక్తి మైసూర్ 8 వ అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. మహిష దసరా ఆచారణ కమిటీ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణను అక్టోబర్ 11 వ తేదీకి వాయిదా వేసింది. 2015 నుంచి దళిత అనుకూల సంస్థలు, అభ్యుదయవాదులు మైసూర్‌లో మహిష దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిష దసరా వేడుకల నిర్వహణను అడ్డుకుంది. ఇటీవల కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మహిష దసరా వేడుకల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి 50 ఏళ్ల మహిష దసరా వేడుకలు జరుపుకుంటున్నట్లు మహిష దసరా వేడుకల కమిటీ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. మహిష దసరా సెలబ్రేషన్ కమిటీ, మైసూర్ యూనివర్సిటీ పరిశోధకుల సంఘం అక్టోబర్ 13 వ తేదీన మహిష దసరా వేడుకలు జరపాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగానే చాముండి కొండను మహిష కొండగా పేర్కొంటూ ఆహ్వాన పత్రికను కూడా విడుదల చేయడంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం అయింది.
ఇక మహిష దసరా వేడుకలపై బీజేపీ ఎంపీ ప్రతాపసింహ సహా చాలా మంది తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహిష దసరా వేడుకలు జరగనివ్వబోమని ఆయన తేల్చి చెప్పారు. ఇక ఈ మహిష దసరా వేడుకలను వ్యతిరేకించాలని ప్రజలకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మహిషుని పేరుతో ఉత్సవాలు నిర్వహించడమంటే హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొంది. అయితే మహిష దసరా కమిటీ దీనిపై స్పందిస్తూ ‘మహిషను రాక్షసునిగా తప్పుగా అభివర్ణించారన్నారు. మైసూరు రాజు మహిష పరిపాలనను నాటి ప్రజలు ఎంతో ఇష్టపడేవారన్నారు. అందుకే మహిష దసరా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.