దేశంలోని ఐదు రాష్ట్రాలకు ఇటీవలె ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే తాజాగా అందులోని ఒక రాష్ట్రంలో జరిగే ఎన్నికల పోలింగ్ తేదీని మారుస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. నవంబర్ 23 వ తేదీన జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను రెండు రోజులు వాయిదా వేసి నవంబర్ 25 వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే మిగితా 4 రాష్ట్రాల్లో ముందుగా విడుదల చేసిన తేదీల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఈసీ స్పష్టం చేసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్వల్ప మార్పులు చేసింది. ముందుగా ప్రకటించిన నవంబర్ 23 వ తేదీకి బదులు.. నవంబర్ 25 వ తేదీన పోలింగ్ జరగనున్నట్లు తెలిపింది. అయితే నవంబర్ 23 వ తేదీన రాజస్థాన్‌లో ఒక్కరోజే 50 వేలకు పైగా వివాహాలు, ఇతర కార్యక్రమాలు ఉండటం వల్లే ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక ఫలితాలను మిగిలిన 4 రాష్ట్రాలతోపాటు డిసెంబర్ 3 వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిపింది.
నవంబర్ 23 వ తేదీన దేవ్ ఉథాని ఏకాదశి కావడం గమనార్హం. ఆ రోజు రాజస్థాన్ వ్యాప్తంగా 50 వేల కంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఎన్నికల పోలింగ్, కోడ్ ఆంక్షలతో పెళ్లిళ్లు చేసుకునేవారితోపాటు వాటికి హాజరయ్యేవారికి తీవ్ర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అటు.. ఇలా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో ఓటింగ్ శాతంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. దేవ్ ఉథాని ఏకాదశి వివాహాలకు అత్యంత అనువైన రోజు అని.. అందుకే ఆ రోజు పెళ్లి చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల తేదీని మార్చినట్లు సమాచారం.
తాజాగా మార్చిన తేదీల ప్రకారం.. రాజస్థాన్‌లో నవంబర్ 25 వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. తొలి విడత నవంబర్ 7, రెండో విడత నవంబర్ 17 వ తేదీన నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే విడతలో.. మిజోరాంలో నవంబర్ 7 వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. చివరికిగా నవంబర్ 30 వ తేదీన తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇక అన్ని ఎన్నికలు పూర్తయిన తర్వాత డిసెంబర్ 3 వ తేదీన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.