ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య, ఆ తర్వాత ఆ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య శాంతి సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల్లో ఉన్న దౌత్య వేత్తలను బహిష్కరించడం.. భారత్ నుంచి కొందరు దౌత్య అధికారులను వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించడం.. ఆ తర్వాత డెడ్‌లైన్‌కు ముందే తమ అధికారులను కెనడా వెనక్కి పంపించడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్, కెనడాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు రహస్యంగా సమావేశం కావడం తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో సమావేశమైన రెండు దేశాల విదేశాంగ మంత్రులు.. గత కొంత కాలంగా భారత్, కెనడా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ రహస్యంగా సమావేశమైనట్టు సమాచారం. అయితే ఈ భేటీ రెండు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రహస్య సమావేశానికి సంబంధించి బ్రిటీష్ వార్తాపత్రిక ఫెనాన్షియల్ టైమ్స్ ఒక కథనాన్ని వెలువరించింది. అయితే ఈ సీక్రెట్ సమావేశానికి సంబంధించి రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు స్పందించలేదు.
ప్రస్తుతం భారత్‌తో నెలకొన్న దౌత్యపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కెనడా ప్రయత్నిస్తోందని.. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం తెలిపింది. ఈ క్రమంలోనే రహస్యంగా సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల మాట్లాడిన కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలి.. భారత్, కెనడాల మధ్య వివాదాన్ని ప్రైవేట్‌గా పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వంతో కెనడా సంప్రదింపులు జరుపుతోందని.. తమ దౌత్యవేత్తల భద్రతను చాలా సీరియస్‌గా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని సాధారణ పరిస్థితికి తీసుకువచ్చేందుకు ప్రైవేట్‌గా భారత్, కెనడాలు సమావేశం కావాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. ఎందుకంటే రెండు దేశాల మధ్య ఉండే దౌత్య పరమైన సమావేశాలు ప్రైవేటుగా జరగడమే మంచిదని పేర్కొన్నారు. ఇక భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా పెరగాలని తాము కోరుకోవడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇప్పటికే ప్రకటించారు. అదే సమయంలో భారత్‌తో కెనడా బాధ్యతాయుతంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ చెప్పిన విధంగా 30 మంది తమ దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం సింగపూర్‌కు తరలించినట్లు కెనడాకు చెందిన సీటీవీ న్యూస్ తెలిపింది.