పంజాబ్ పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి కీలక సూత్రధారి, జైషే మొహ్మద్ ఉగ్రవాది షాహిత్ లతీఫ్ పాకిస్థాన్‌లో అనూహ్యంగా హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తుల జరిపిన కాల్పుల్లో లతీఫ్ హతమయ్యాడు. సియాల్‌కోట్‌లోని ఓ మసీదులో అతడ్ని కాల్చి చంపారు. పాక్ మీడియా కథనం ప్రకారం.. స్థానిక పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్న షూటర్లు.. లతీఫ్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారు. ఈ హత్యలో స్థానిక, స్వదేశీ ఉగ్రవాదుల ప్రమేయాన్ని ఇది సూచిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌తో సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నాల్లో భాగంగా లతీఫ్ సహా 24 పాక్ ఉగ్రవాదులను 2010లో భారత్ విడుదల చేసింది. యాదృచ్ఛికంగా ఎయిరిండియా విమానాన్ని హైజాక్ చేసిన జైష్ ఉగ్రవాదులే లతీఫ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే, అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం లతీఫ్, మరో 31 మందిని విడుదల చేయడానికి నిరాకరించింది. డిసెంబరు 1999లో 154 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఎయిరిండియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి.. భారత్ జైల్లో ఉన్న జైషే చీఫ్ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌తో పాటు మరో ఇద్దరిని విడిపించుకున్న విషయం తెలిసిందే.
పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై 2016 జనవరి 2న జరిగిన ఉగ్రదాడికి జైషే మహ్మద్ టాప్ కమాండర్ లతీఫ్ వ్యూహకర్త. ఇటీవల పాక్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల హత్యలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు దాడికి తెగబడిన ఘటనలో మొత్తం 9 మంది జవాన్లు అమరులయ్యారు. సైన్యం, ముష్కర మూకల మధ్య దాదాపు 17 గంటల పాటు భీకర కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి. పఠాన్‌కోట్ దాడి వెనుక షాహిద్ లతీఫ్ హస్తం ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. పాక్ నుంచే వ్యూహరచన చేసి.. ఐదుగురు ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌పై దాడికి పంపినట్లు దర్యాప్తు నివేదికలు పేర్కొన్నాయి.