తిరుమల శ్రీవారి భక్తులు.. ఎప్పుడెప్పుడు స్వామివారిని దర్శించుకుందామా అని కొన్ని వేల మంది ఆరాట పడుతుంటారు. మరి తిరుపతి టూర్ అంటే మనకు వీలవటమే కాదు.. టికెట్లు కూడా బుక్ చేసుకుని ఉండాలి మరి. తిరుపతి టూర్ ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ కాకపోతే మనం బుక్కయిపోతుంటాం. అందుకే.. అందుకు సంబంధించిన టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారా.. బుక్ చేసుకుందామా అని నెలల ముందు నుంచే జనాలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే.. ఏ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక.. కొన్నిసార్లు మిస్సవుతుంటాం. అసలే.. టికెట్లు ఇలా పెట్టగానే అలా అయిపోతుంటాయి.. అలాంటిది ఇక ఎప్పుడు విడుదల చేస్తారో తెలియకపోతే పరిస్థితి అంతే. అందుకు టీటీడీ వాళ్లు ముందుగానే ఏ ఏ టికెట్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారన్నది కూడా ముందుగానే షెడ్యూల్ విడుదల చేశారు. ఆ షెడ్యూల్ మీకోసం..
శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం 2024 జనవరి నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీడిప్ కోసం అక్టోబర్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవా టికెట్లను అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు.
వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ అక్టోబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
డిసెంబరు నెలకు సంబంధించి అక్టోబరు 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను.. ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.
భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది.