విశాఖకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని రాజమహేంద్రవరంలో ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపింది. చనిపోయే ముందు ఆమె రాసిన లెటర్ కంటతడి పెట్టిస్తోంది. విశాఖ త్రినాథపురంనకు చెందినగురువల్లి రాజశ్రీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ దివాన్‌చెరువు దగ్గర ఉన్న ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో ఏడాది చదువుతోంది. తోటి విద్యార్థినులు మరో ఇద్దరితో కలిసి స్థానికంగా ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటూ రోజూ కాలేజీకి వెళ్లివస్తుంది. బుధవారం తోటి విద్యార్థినులు కళాశాలకు వెళ్లగా రాజశ్రీ మాత్రం ఒంటరిగా గదిలోనే ఉండిపోయింది.
సాయంత్రం కాలేజీ ముగిసిన తర్వాత తోటి విద్యార్థినులు వచ్చేసరికి.. రాజశ్రీ ఫ్యానుకు ఉరేసుకుని ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కానీ అప్పటికే రాజశ్రీ మృతి చెందినట్లు గుర్తించారు. గదిలో యువతి రాసిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేకపోతున్నాని ప్రస్తావించారు. తన అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసి ఉంది. ఇలా చేయడం తప్పు అని తెలిసినా తప్పక చేస్తున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మ, తమ్ముడు తనను క్షమించాలని లేఖలో పేర్కొంది రాజశ్రీ. తమ్ముడ్ని బాగా చదువుకుని అమ్మను జాగ్రత్తగా చూసుకోమని కోరింది.
కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. రాజశ్రీ గత కొంత కాలంగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతోందట. తల్లి తరచూ వచ్చి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తున్నట్లు తోటి విద్యార్థినులు చెబుతున్నారు. తరచూ ముక్కు, చెవి నుంచి రక్తం కారడం, ఇటీవల రక్తపు వాంతులు సైతం చేసుకుంది అంటున్నారు. అనారోగ్య కారణాలతోనే ప్రాణాలు తీసుకుని ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. యువతి తల్లికి సమాచారం ఇచ్చామని.. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.