ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో చెదురుమదరుగా వర్షలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈ నెలలో ఈశాన్య రుతు పవనాలు ఏపీని తాకుతాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ. ఈ నెలాఖరు, నవంబర్ నెలలో వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడలో 48.8 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో 43.2, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 42.2, ఏలూరు జిల్లా కైకలూరులో 34.4, చిత్తూరులో 26, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోటలో 23, ఏలూరు జిల్లా నూజివీడులో 12.6, చిత్తూరు జిల్లా నగరిలో 12.2, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 11, చిత్తూరు జిల్లా శాంతిపురంలో 10.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉపరితల ఆవర్తనం కారణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 25 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఐరాలలో 54.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాలవారీగా పుంగనూరులో 43.2, పాలసముద్రంలో 42.2, కార్వేటినగరంలో 41.6, గంగాధరనెల్లూరులో 39.2, చౌడేపల్లిలో 36.4, బైరెడ్డిపల్లిలో 36.4, చిత్తూరులో 26.0, పెద్దపంజాణిలో 25.2, పూతలపట్టులో 23.4, వి.కోటలో 23.0, శ్రీరంగరాజపురంలో 22.2, తవణంపల్లెలో 17.2, సోమలలో 16.4, నగరిలో 12.2, గుడిపాలలో 12.2, రొంపిచెర్లలో 11.2, శాంతిపురంలో 10.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షం పడింది.
మరోవైపు ఖరీఫ్‌లో వానలు అంతంతమాత్రంగానే ఉంది. రబీ వచ్చినా పరిస్థితి అలాగే ఉంది.. అక్టోబరులోనూ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 40 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణంతో పోలిస్తే 5 నుంచి 6 డిగ్రీల వరకు పెరగడంతో పరిస్థితి ఎండాకాలాన్ని తలపిస్తోంది. సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో వానలు, చలి ప్రభావం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉక్కపోత అధికమైంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నవంబరు వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.