ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యుద్ధంలో ఇజ్రాయెల్ వైట్ ఫాస్పరస్ వాడిందని ఆరోపణలు,,,,తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ఐక్యరాజ్యసమితి

international |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 10:52 PM

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్స్ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పై నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లతో హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడులు.. ఆ తర్వాత ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి చేసిన అకృత్యాలకు ప్రతీకారంగా అత్యంత దారుణమైన రీతిలో దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా కొత్త భయాలు నెలకొంటున్నాయి. ఈ యుద్ధంలో హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు వైట్ ఫాస్పరస్(తెల్ల భాస్వరం) తో తయారు చేసిన మందుగుండును ఇజ్రాయెల్ భద్రతా బలగాలు వాడినట్లు తీవ్ర ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.


అయితే ఈ యుద్ధంలో వైట్‌ ఫాస్పరస్‌తో తయారు చేసిన బాంబులను ఇజ్రయెల్ సైన్యం ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణలు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. వీటిని గాజా స్ట్రిప్‌తోపాటు లెబనాన్‌ పైకి కూడా ప్రయోగించినట్లు తమ పరిశీలనలో వెల్లడైందని హ్యూమన్‌ రైట్స్‌ గ్రూప్‌ వాచ్‌ అనే సంస్థ వెల్లడించింది. అయితే గాజాపై యుద్ధంలో తాము వైట్ ఫాస్పరస్ ఉపయోగించి దాడులు చేశామని వస్తున్న ఆరోపణలను ఇజ్రాయెల్‌ సైన్యం తీవ్రంగా ఖండించింది. అవన్నీ అబద్ధపు ప్రచారాలే అని కొట్టి పారేసింది. అయితే యుద్ధంలో ఇలా ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించడం విరుద్ధం కాగా.. కొన్ని దేశాల సైన్యం వాటిని ఉపయోగిస్తున్నాయి. పైగా వైట్ ఫాస్పరస్‌ను అంత ప్రమాదకరం కాని విధంగానే వాడుతున్నట్లు చెబుతున్నాయి.


ఈ వైట్ ఫాస్పరస్ చాలా డేంజరెస్ కెమికల్. ఈ వైట్ ఫాస్పరస్‌కు ఆక్సిజన్‌ తోడైతే మండుతుంది. ఒకసారి మంటలు మొదలైతే ఆక్సిజన్ లేదా వైట్ ఫాస్పరస్ అయిపోయే వరకు మండుతూనే ఉంటుంది. అలా ఏర్పడిన మంటలను ఆపడం చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. చాలా వేగంగా మండుతూ దాదాపు 800 డిగ్రీల సెల్సియస్‌ వేడిని ఉత్పత్తి చేస్తుందని పేర్కొంటున్నారు. ఇంతటి భారీ ఉష్ణోగ్రత వద్ద లోహాలు కూడా కరిగిపోతాయని.. మంటలు, దట్టమైన పొగను చాలా దూరం వరకు విస్తరించేలా చేస్తుందని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధంలో పొగను సృష్టించి ప్రత్యర్థుల దృష్టిని మళ్లించేందుకు కొన్ని దేశాల సైన్యం ఉపయోగిస్తున్నాయి. ఘాటు వాసనతో చాలా సమయం గాల్లోనే ఆ పొగ ఉంటుంది. వీటిని శతఘ్నుల నుంచి వచ్చే గుళ్లు, బాంబులు, రాకెట్లు, గ్రనేడ్లలో ఉపయోగించి ప్రత్యర్థులపైకి ప్రయోగిస్తారు.


అయితే ఈ వైట్ ఫాస్పరస్ వాడటంపై ఐక్యరాజ్యసమితి కొన్ని నిషేధాలు విధించింది. జన ఆవాసాలు ఉన్న ప్రాంతాల్లో మంటలు సృష్టించేందుకు ఉపయోగించడం ఐక్యరాజ్యసమితి సంప్రదాయ ఆయుధాల ఒప్పందం కింద నిషేధం విధించింది. అయితే యుద్ధంలో పొగను సృష్టించడానికి లేదా మంటల ద్వారా యుద్ధంలో సంకేతాలు పంపుకునేందుకు ఈ వైట్ ఫాస్పరస్‌ను ఉపయోగిస్తున్నట్లు కొన్ని దేశాలు సాకులు చెబుతున్నాయి.


ఈ వైట్ ఫాస్పరస్ వల్ల మనుషులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైట్ ఫాస్పరస్ వల్ల వచ్చే మంటలతో కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ పొగను పీల్చడం వల్ల శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని.. ఆ మంటలు చర్మాన్ని పూర్తిగా కాల్చేస్తాయని పేర్కొన్నారు. ఇక ఈ వైట్ ఫాస్పరస్.. శరీరంలోకి ప్రవేశిస్తే కాలేయం, మూత్రపిండాలు, గుండె వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అయితే వీటిని సరైన సమయంలో గుర్తించి.. చికిత్స అందించకుంటే అవయవాలు ఫెయిల్ అవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa