ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నాప్ అయితే నాకేంటి? రెంట్ కట్టాల్సిందే.. లేకుంటే సామాన్లు విసిరేస్తా

international |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 10:53 PM

ఇజ్రాయేల్‌లోకి చొరబడి.. హమాస్ ముష్కరులు చేసిన మారణహోమం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గర్బిణిలు, పిల్లలు, వృద్ధులనే కనికరం చూపకుండా ఊచకోతకు తెగబడ్డారు. యువతులు, మహిళలను అపహరించి.. బందీలుగా చేసుకున్నారు. గాజా సరిహద్దుల్లో జరిగిన సూపర్ నోవా మ్యూజిక్ పార్టీలో నరమేధానికి పాల్పడి..250 మందికి పైగా పౌరులను హతమార్చారు. ఈ వేడుకకు హాజరైన పదుల సంఖ్యలో యువతులను ఎత్తుకెళ్లారు. ఇలా హమాస్ బంధించిన యువతులలో ఇన్బార్ హైమన్ (27) కూడా ఒకరు. అయితే, ఇన్బార్ అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని.. మానవత్వం లేకుండా వ్యవహరించి తీరు విస్మయానికి గురిచేస్తోంది. హమాస్ చెరలో బందీగా ఉన్నా.. తనకు రావాల్సిన అద్దె చెల్లించాలని పట్టుబట్టాడు.


ఇన్బార్‌ను హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఆమె రూమ్మేట్ నోమ్ అల్లోన్ చెప్పినా సదరు ఓనర్ వినిపించుకోలేదట. ‘కిడ్నాప్ అయితే నాకేంటి.. అది నా సమస్య కాదు. టైమ్‌కు రెంట్ కట్టకుంటే సామాన్లు బయటపడేసి వేరే వాళ్లకు అద్దెకు ఇచ్చుకుంటా’ అని కర్కశకంగా మాట్లాడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. మరో రూమ్మేట్‌ను వెతుక్కుంటావా లేక ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి నా రెంట్ చెల్లిస్తావా.. ఏం చేస్తావో నువ్వే నిర్ణయించుకోమని కఠినంగా చెప్పాడని తెలిపింది. ఈ విషయాన్ని ఇన్బార్ రూమ్మేట్ ఆమె తండ్రికి తెలియజేశాడు. దీంతో ఆ ఓనర్ తో జరిపిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్ లను ఇన్బార్ తండ్రి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.


‘స్పష్టంగా చెబుతున్నాం.. 2,500 షెకెల్స్ (దాదాపు 630 డాలర్లు) అద్దె చెల్లించాల్సిన బాధ్యత మీకు ఉంది.. గదిని ఖాళీ చేయడం గురించి మీరు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడాలి’అని ఇంటి యజమాని మెసేజ్ పంపాడు. ఈ స్క్రీన్ షాట్‌లను హైమన్ తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జెరూసలేం పోస్ట్ ప్రకారం, ‘నా వయస్సు 52 ఏళ్లు.. నా జీవితంలో నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటానని ఎప్పుడూ అనుకోలేదు’ అన్నారాయన. ‘అపార్ట్‌మెంట్ ఓనర్‌లు ఇతరులతో ఇలాగే వ్యవహరిస్తే వాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నేను షేర్ చేశాను...అతనికి క్షమాపణ చెప్పే సమయం ఇవ్వడానికి నేను ఉద్దేశపూర్వకంగా అతని పేరు.. ఫోన్ నంబర్‌ను ప్రచురించలేదు. ఇన్బార్ ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చే వరకు నేను అతడు చెప్పింది వినాలనుకోలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.


ఓవైపు కూతురు మిలిటెంట్ల చెరలో ఉందని తాము బాధపడుతుంటే ఇంటి ఓనర్ కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మిగతా ఓనర్లైనా కనీస మానవత్వం చూపాలని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడం, నెటిజన్లు తీవ్రంగా మండిపడడంతో ఇన్బార్ ఓనర్ స్పందించాడు. ఇన్బార్ అసలు రెంట్ బాకీ పడలేదని, అలాంటప్పుడు తాను రెంట్ ఎలా డిమాండ్ చేస్తానని ఎదురు ప్రశ్నించాడు. అందరితో పాటు తాను కూడా ఇన్బార్ సహా ఇతర బంధీలు అంతా క్షేమంగా రావాలనే కోరుకుంటున్నానని చెప్పాడు. అయితే, అపార్ట్‌మెంట్ యజమాని ఆరోన్ రీస్‌గా గుర్తించారు. ఆయన ఈ ఆరోపణలను ఖండించారు. డబ్బు కోసం తాను అలాంటి డిమాండ్లేమీ చేయలేదని పేర్కొన్నాడు. ‘తల్లిదండ్రుల బాధలో నేను పాలుపంచుకుంటున్నాను.. వారి కుమార్తె క్షేమంగా వీలైనంత త్వరగా తిరిగి వస్తుంది.. ఇక్కడ అవమానకరమైన విషయం ఏంటంటే ఆమెకు నాకు ఎటువంటి అద్దె బాకీపడలేదు. ఈ మొత్తం పరిస్థితి ఎలా వచ్చింది? నాకు తెలియదు. నేను డబ్బు అడగలేదు..’ అని తెలిపాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa