500 మంది ప్రాణాలు తీసిన గాజా ఆస్పత్రి పేలుడుపై హామస్, ఇజ్రాయేల్ ఒకరినొకరు నిందించుకుంటున్న విషయం తెలిసిందే. ఇజ్రాయేల్ రాకెట్ దాడి వల్లే పేలుడు జరిగిందని హమాస్ ఆరోపించగా... నెతన్యాహు ప్రభుత్వం మాత్రం ఇందులో మా పాత్రేమీలేదని ప్రకటించింది. అంతేకాదు, ఇస్లామిక్ జిహాద్ రాకెట్ మిస్‌ఫైర్ కారణమని ఇజ్రాయేల్ సైన్యం ఆరోపించింది. ఈ నేపథ్యంలో పేలుడుకు సంబంధించిన పలు వీడియోలను ఇజ్రాయేల్ ప్రభుత్వం విడుదల చేసింది. ఘటనకు ముందు, తర్వాత ఆస్పత్రి, పరిసరాలు ఓ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ రాకెట్ దాడి విఫలమై గాజా నగరంలోని అల్ అహ్లి ఆస్పత్రిని తాకింది.. ఇస్లామిక్ జిహాద్ ఉగ్రవాద సంస్థ విఫలమైన రాకెట్ ప్రయోగానికి ముందు... తరువాత ఆసుపత్రి చుట్టూ ఉన్న ప్రాంతం నుంచి ఐఏఎఫ్ ఫుటేజ్ ఇది’ అని ఐడీఎఫ్ ట్వీట్ చేసింది. ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో రాకెట్ ల్యాండ్ కావడంతో భవనం మంటల్లో చిక్కుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. తమ ఆయుధాలు ముఖ్యంగా రాకెట్లు, అధిక-ప్రభావాన్ని కలిగిస్తాయని, అవి తాకిన ప్రదేశంలో పెద్ద గుంతలు సృష్టిస్తున్నాయని ఇజ్రాయేల్ ఆర్మీ పేర్కొంది. ఆసుపత్రి సమీపంలో గోతులు కనిపించడం లేదని, భవనానికి కూడా పెద్దగా నష్టం వాటిల్లినట్లు కనిపించడం లేదని తెలిపింది.
ఘటనా స్థలి వద్ద పేలుడు ప్రభావాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి వివరిస్తూ.. రాకెట్‌లో నిల్వ ఉన్న ఇంధనం వల్ల మంటలు వ్యాపించినట్టు ఉందని చెప్పారు. ‘ఈ నష్టం చాలావరకు ప్రొపెల్లెంట్ వల్ల జరిగి ఉండేది.. కేవలం వార్‌హెడ్ మాత్రమే కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అల్ అహ్లి ఆస్పత్రి పేలుడులో 500 మంది ప్రాణాలు కోల్పోయారని, అక్కడ దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయని గాజా అధికార వర్గాలు తెలిపారు. గాయపడినవారిని సమీపంలో మెడికల్ సెంటర్లకు తరలించినట్టు వివరించారు.
రక్తమోడుతున్న వందలాది మృతదేహాలు అల్ షిఫా ఆస్పత్రి ఫ్లోర్లపై పడేసి ఉన్నాయి. తమ ప్రియమైనవారిని గుర్తించేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. బుధవారం ఇజ్రాయేల్‌లో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో అరబ్ నేతలు తమ భేటీని రద్దు చేసుకున్నారు. సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, యూఏఈ దేశాలు ఈ పేలుడును ఖండించాయి. ఇజ్రాయేల్‌వైపే అవి వేలెత్తి చూపిస్తున్నాయి. గత 11 రోజులుగా ఇజ్రాయేల్ జరుపుతున్న దాడుల్లో 3 వేల మందికిపైగా పాలస్తీనియన్లు చనిపోయినట్టు ఈ పేలుడుకు ముందు గాజా అధికారులు ప్రకటించారు.