ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాపై దాడులు ఆపితే ఇజ్రాయెల్ బంధీలను విడుదల చేస్తాం: హమాస్ ప్రతిపాదన

international |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 11:40 PM

ఇజ్రాయెల్‌పై దాడులు చేసి తాము పెద్ద తప్పు చేశామని.. హమాస్ మిలిటెంట్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌పై భీకర దాడులకు తెగబడిన హమాస్ ఉగ్రవాదులు.. ఆ దేశ భూభాగంలోకి చొరబడి ఇజ్రాయెల్ వాసులతోపాటు విదేశీయులను కూడా బందీలుగా తీసుకువెళ్లి గాజాలో రహస్య ప్రాంతాల్లో దాచారు. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడులను తిప్పికొడుతున్న ఇజ్రాయెల్.. గాజా భూభాగంపై హమాస్ ఉనికి లేకుండా చేయాలనే కంకణం కట్టుకుని.. మరిన్ని దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే ప్రాణాల కోసం ఆరాటపడుతున్న హమాస్ మిలిటెంట్లు రాజీ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.


ఈ మేరకు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేసి మహిళలు, చిన్నపిల్లలు, సైనికులు, విదేశీ పౌరులను ఎత్తుకెళ్లి తమ వద్ద బందీలుగా ఉంచుకున్న హమాస్ ఉగ్రవాదులు వారిని విడుదల చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎన్‌బీసీ న్యూస్ ఒక కథనం వెలువరించింది. ఈ క్రమంలోనే బందీలను విడుదల చేసేందుకు ఒక కండీషన్ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. వాటిని ఆపేస్తే బందీలను విడిచిపెడతామని.. హమాస్‌ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పినట్లు ఎన్‌బీసీ న్యూస్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం.. గాజాలో దాడులు ఆపేసిన గంట వ్యవధిలోనే బందీలను మొత్తం విడిచిపెడతామని ఆ అధికారి చెప్పినట్లు పేర్కొంది. ప్రస్తుతం దాడులు జరుగుతుండగా బందీలను విడిచిపెట్టే పరిస్థితులు లేవని చెప్పినట్లు తెలిపింది. అయితే ఆ హమాస్ సీనియర్ అధికారి పేరు మాత్రం వెల్లడించలేదు.


అక్టోబరు 7 వ తేదీన తెల్లవారుజామున ఇజ్రాయెల్‌ భూభాగంపై 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేల రాకెట్లతో హమాస్‌ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత సరిహద్దుల్లోని కంచెను తొలగించి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడడం.. జల మార్గంలో కూడా ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి మారణ హోమం సృష్టించారు. ఈ దాడుల్లో భాగంగానే ఇజ్రాయెల్‌లో ఉన్న పౌరులను హమాస్‌ ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసి వారిని గాజాలో బందీలుగా చేశారు. అయితే ప్రస్తుతం గాజాలో హమాస్‌ మిలిటెంట్ల స్థావరాల్లో దాదాపు 200 మంది ఉన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తెలిపింది.


ఇక ఇజ్రాయెల్‌పై చేసిన దాడులకు హమాస్‌ ఉగ్రవాదులు భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నారు. గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ ఏకంగా హమాస్ అంతమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో గాజాలో తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ దాడుల్లో భాగంగానే మంగళవారం గాజాలోని ఓ ఆస్పత్రి వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు ఇజ్రాయెల్‌ కారణమని హమాస్‌ ఆరోపిస్తుండగా.. దాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఖండించింది. పీఐజే ఉగ్ర సంస్థ ప్రయోగించిన రాకెట్ గురితప్పి ఆస్పత్రిపై పడిందని పేర్కొంటూ వీడియోలు కూడా విడుదల చేసింది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com