ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజం గెలవాలి పేరుతో,,,జనంలోకి నారా లోకేష్, భువనేశ్వరి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 19, 2023, 09:06 PM

ఏపీలో టీడీపీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వారానికి కనీసం రెండు మూడు చోట్ల భువనేశ్వరి పర్యటనలు ఉండేలా పార్టీ కార్యాచరణను సిద్ధం చేసింది. అలాగే భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు బదులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనంలోకి వెళ్లనున్నారు. యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన లోకేష్.. చంద్రబాబు జైలు నుంచి రాగానే పాదయాత్రను కొనసాగిస్తారని చెబుతున్నారు. అప్పటివరకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాన్ని లోకేశ్‌ చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షపై నాలుగైదు రోజుల్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.


చంద్రబాబు అరెస్ట్ తర్వాత కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి.. ఎన్నికల ముందు కీలకమైన సమయం కావడంతో పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తే మంచిదని సీనియర్ నేతలు భువనేశ్వరి, లోకేష్‌ యాత్రలపై నిర్ణయం తీసుకున్నారు. అయితే లోకేష్‌ కూడా తన పాదయాత్రను మళ్లీ ప్రారంభించాలని భావించారు. కానీ చంద్రబాబుకు కోర్టులో ఊరట లభించే వరకూ సమన్వయం కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వస్తోంది. ఒకవేళ పాదయాత్ర ప్రారంభించినా మధ్యలో ఆపడం సరికాదని నాయకులు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయన కూడా ప్రస్తుతానికి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు.


ఈ నెల 21వ తేదీ అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అంతేకాదు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత లోకేష్ బుధవారం‌ తన క్యాంప్‌ ఆఫీసులో అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. విజయవాడలో నిర్వహించే పార్టీ విస్తృత స్థాయి సమావేశంపైనా చర్చ జరిగింది.


మరోవైపు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ నేతలు కలిశారు. చంద్రబాబు అరెస్ట్ వెనకున్న రాజకీయ కుట్రల్ని, ఆధారాల్లేని కేసుల్లో జైలుకు పంపిన వైనాన్ని కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ ని కోరామన్నారు నేతలు. చంద్రబాబుపై ప్రభుత్వం ఏఏ అంశాలపై అయితే తప్పుడు కేసులు పెట్టిందో, వాటన్నింటికి సంబంధించిన పూర్తి వాస్తవాలను టీడీపీ గవర్నర్ ముందు ఉంచామన్నారు. అరాచకాలు, అకృత్యాలను నిరోధించాలని, ప్రజలకు సంక్రమించిన రాజ్యాంగ, ప్రజాస్వామ్యమైన హక్కుల్ని, రూల్ ఆఫ్ లాను కాపాడాలని, కాన్ స్టిట్యూషనల్ హెడ్ అయిన గవర్నర్‌ను కోరామన్నారు. పైసా అవినీతి కూడా జరగని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసులో చంద్రబాబు రూ.370 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారన్నారు. ఆ తర్వాత రూ.340కోట్లని విషప్రచారం చేశారని.. చివరకు రూ.27కోట్లనే స్థితికి దిగజారారన్నారు. కథ ముగింపుకు వచ్చేసరికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన సంస్థ, కేంద్రానికి రూ.8..50 కోట్ల జీఎస్టీ చెల్లింపులు సరిగా చేయనందునే చంద్రబాబుపై కేసు పెట్టినట్టు జగన్ ప్రభుత్వం వాదిస్తోందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com