పార్టీ నాయకుల ఎటువంటి అంతర్గత సమస్యలు లేవని, ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా ఉన్నందున ఎటువంటి అనుమానాలకు తావులేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాలు వస్తున్నాయని బీజేపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని డీకే విమర్శించారు. అంతేకాదు, ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని, ఈ విషయం నాకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు కలిసి, బేరసారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ బయటకు వస్తాయని, అప్పటి వరకు వేచి ఉండాలని మీడియా ప్రతినిధులకు వివరించారు.
“మా పార్టీ నాయకులలో ఎవరు ఎవరిని కలిశారో.. వారి ఆఫర్ల వివరాలు కూడా నాకు తెలుసు. సంబంధిత శాసనసభ్యులు సమావేశాల వివరాలను అందించారు.. బీజేపీ నాయకులు నాకు, ముఖ్యమంత్రికి ఆఫర్లు ఇచ్చారు’ అని కేపీసీసీ చీఫ్ డీకే ఆరోపించారు. బుధవారం బెళగావి జిల్లా పర్యటన సందర్భంగా శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, డిప్యూటీ సీఎం పర్యటనకు మంత్రులు సతీశ్ జార్ఖిహొళి, లక్ష్మీ హెబ్బాళ్కర్ దూరంగా ఉండటం రాజకీయవర్గాలను విస్మయానికి గురిచేసింది. కొన్ని రోజులుగా సతీశ్- లక్ష్మి మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. బెళగావిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి నాయకులు ఎందుకు రాలేదని మీడియా ప్రశ్నించగా.. లక్ష్మీ హెబ్బాళ్కర్ భద్రావతిలో కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని, మహంతేశ్ కౌజలగి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లారని కేపీసీసీ చీఫ్ చెప్పారు.
సతీశ్ జార్ఖిహొళి, తాను సోమవారమే కలిసి మాట్లాడుకున్నామని, పార్టీలో నాయకులు అందరూ ఐకమత్యంతోనే ఉన్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గ కుమ్ములాటలు ఉన్నాయని జేడీఎస్, వారి మిత్రపక్షం బీజేపీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. నిరాశ, నిస్పృహలతో ఉన్న ఆ పార్టీలు.. కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగదీశ్ షెట్టర్‌తో బీజేపీ నేత రమేశ్ జార్ఖిహోళి కలిసిన రెండు రోజుల అనంతరం శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. షెట్టర్‌తో రమేశ్ జార్ఖిహోళి సమావేశం కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య విబేధాలు తలెత్తాయే ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ ప్రచారాన్ని డీకే ఖండించారు. షెట్టర్ విధేయతను శంకించాల్సిన పనిలేదని, ఆయనపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. షెట్టర్ సామర్థ్యాలను గుర్తించి, ఆ సమావేశం ప్రాముఖ్యతను తగ్గించే ప్రయత్నం చేశారు.
‘ప్రతి విషయాన్ని మనం అనుమానించలేం. జగదీష్ శెట్టర్ తన సత్తా ఏమిటో చూపించారు. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను’అని అన్నారు. కర్ణాటక ఎన్నికల ముందు వరకూ బీజేపీలో ఉన్న జగదీశ్ షెట్టర్.. అధిష్ఠానం తనకు టిక్కెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీచేసి ఓటమిపాలైన షెట్టర్‌కు ఆ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది.