చంద్రబాబుపై అంత బాధ ఉంటే హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదో చెప్పాలని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన కోసం బాలకృష్ణ సినిమాలను ఎందుకు ఆపలేరు? టీడీపీ అధినేత కుటుంబం, టీడీపీ కేడర్ అంతా బాధలో ఉంటే బాలకృష్ణ సినిమాను ఎలా విడుదల చేశారు? అలాంటప్పుడు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎందుకు నిరసన తెలపాలి? అని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుపై అంత బాధ ఉంటే హెరిటేజ్‌ను ఎందుకు మూయలేదో చెప్పాలన్నారు. చంద్రబాబు కోసం హెరిటేజ్ మూయరు... బాలకృష్ణ సినిమాను ఆపేయరు... కానీ ప్రజలు మాత్రం రోడ్డుపైకి రావాలా? అన్నారు.
బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదని, బ్యాక్ బోన్ అని నమ్మిన వ్యక్తి జగన్ అని, వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్ అన్నారు. బీసీల ఖాతాల్లో లక్షా పదకొండువేల కోట్ల రూపాయలు వేసిన వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో పేదరికం 12 శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందన్నారు. ఈ లెక్కలు చెబుతోంది కూడా నీతి అయోగ్ అన్నారు. చంద్రబాబు హయాంలో బీసీలను మోసం చేశారన్నారు. జగన్ హయాంలో స్కీంలు ఉంటే, చంద్రబాబు హయాంలో స్కాంలు జరిగాయన్నారు.
చంద్రబాబును ఇక్కడ అరెస్ట్ చేస్తే హైదరాబాద్‌లో గొడవలు ఏమిటని ప్రశ్నించారు. జైల్లో ఆయన కిలో పెరిగితే... ఐదు కిలోలు తగ్గినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కల్యాణ్ చెబుతున్నారని, కానీ జగన్‌కు వ్యతిరేక ఓటు ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. బస్సు యాత్ర ద్వారా జగన్ పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరిస్తామన్నారు.