కవి, సాహితీ విమర్శకుడు జూపల్లి ప్రేమ్‌చంద్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో 1957 ఫిబ్రవరి 4న ప్రేమ్‌చంద్ జన్మించారు. తండ్రి అప్పారావు ఉద్యోగ నిర్వహణలో భాగంగా అనంతపురం జిల్లాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తెలుగు సాహిత్యంపై ఆసక్తితో ప్రేమ్‌చంద్ ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్‌డీని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు. తొలినాళ్లలో తెలుగు అధ్యాపకుడిగా, ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2015లో అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. తరువాత బోధనా వృత్తిని వదిలేసి, ‘వాయిస్’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనంతరం జిల్లా గ్రామీణ సమస్యల మీద, ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో సామాజికాభివృద్ది లక్ష్యంగా పనిచేశారు. 1981లో ‘ఓట్లన్నీ పోలయినాయి’ పేరుతో కథానిక రాసి, రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి అందుకున్నారు.