ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరుల సంస్మరణ దినంను గడిచిన 64 ఏళ్లుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు సీఎం జగన్. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ త్యాగాలను స్మరించుకుంటున్నామని.. దేశ ప్రజలంతా పోలీసులను మనసులో సెల్యూట్ చేసే రోజన్నారు.
అమరులైన పోలీసులందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని.. విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన పోలీస్ సోదరులకు ప్రభుత్వం అన్నివిధాలుగా తోడుగా ఉంటుందన్నారు. పోలీస్ సమాజం కోసం తన ప్రాణాన్ని బలిపెట్టడానికి సిద్ధపడిన యోధుడని ప్రశంసించారు. ఖాకీ డ్రెస్ అంటే త్యాగనీరతి.. పోలీస్ ఉద్యోగం అనేది ఓ సవాల్, బాధ్యత అన్నారు. అలాంటి పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఏపీలో పోలీస్ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. వైద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఆరోగ్య భద్రత కల్పిస్తోందన్నారు. ఏపీతో పాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆస్పత్రుల ద్వారా చికిత్స అందిస్తోందన్నారు.
విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. శాంతి భద్రతలను పరిరక్షించాలని.. సాంకేతికతకు తగ్గట్లు అప్‌డేట్ కావాలన్నారు. అసాంఘీక శక్తులు చట్టాల్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాయని.. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు అణచి వేయాలన్నారు. అలాంటి దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా చట్టాన్ని అమలు చేయాలని.. దుష్టశక్తులకు గుణపాఠం చెప్పకుంటే సమాజంలో రక్షణ ఉండదన్నారు.
పోలీస్ అంటే అధికారం మాత్రమే కాదు ఓ బాధ్యతని.. ఈ ఉద్యోగం ఓ సవాల్ అన్నారు. ముఖ్యంగా నేరం వేగంగా తన రూపాన్ని మార్చుకుంటున్న తరుణంలో సైబర్ సెక్యూరిటీ ప్రధానాంశమన్నారు. డేటాథెప్ట్, సైబర్ హెరాస్ మెంట్ వరకూ అన్ని అంశాల్లో దర్యాప్తు చేసి శిక్షవేయాలన్నారు. దీనికి మన పోలీసులు ఎంతో అప్డేట్ కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సైబర్ ప్రపంచంలో నేరగాళ్లు చీకటి ప్రపంచంలో ఉండి సవాళ్లు విసురుతున్నారన్నారు.. వారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. నేర నిరోధం, నేర దర్యప్తులో ఏపీ పోలీసులు అత్యాధునిక సైబర్ టెక్నాలజీని ఉపయోగిస్తూ దేశంలోనే ముందున్నారని తెలిపారు. రాష్ట్రంలో 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ స్థాయిలో సచివాలయాల్లో నియమించామన్నారు. దిశాయాప్, పోలీస్ స్టేషన్‌లు, పీపీలను నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు.
అలాగే అన్నమయ్య జిల్లా అంగళ్లులో ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడులు చేయించిందన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘటనలో 40 మంది పోలీస్ సిబ్బందికి గాయాలు అయ్యాయన్నారు. ఓ పోలీస్ కన్ను కోల్పోయారని.. న్యాయమూర్తలుపైనా ట్రోలింగ్ చేస్తున్నార్నారు. అలాంటి దుష్టశక్తుల విషయంలో కఠినంగా ఉండాలి అని పోలీసులకు సూచించారు ముఖ్యమంత్రి. అనంతరం పోలీసులకు పతకాలను అందజేశారు.