మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. విశాఖలో టీడీపీ నేతలను తరచూ గృహనిర్బంధం చేస్తూ, కార్యక్రమాలను అడ్డుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని విశాఖపట్నం పోలీసులను ఆదేశించింది.స్వేచ్ఛగా తిరిగే విషయంలో అడ్డంకులు సృష్టించొద్దని చెప్పింది. విశాఖ పోలీసులు తనకు తరచూ సీఆర్‌పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇచ్చి కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని.. గృహనిర్బంధం చేస్తున్నారని గంటా శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబరులో ఇచ్చిన ఐదు నోటీసులను రద్దుచేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పిటిషనర్ శాంతియుతంగా కార్యక్రమాలను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని గంటా తరఫు లాయర్ వాదనలు వినిపించారు. గృహనిర్బంధం ఎందుకని అడిగినా కారణాలు చెప్పట్లేదని.. శాంతియుతంగా బహిరంగ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవడం పౌరుల ప్రాథమిక హక్కని ప్రస్తావించారు. పోలీసులు పిటిషనర్ కదలికలను అడ్డుకుంటూ గొంతు నొక్కుతున్నారని.. సీఆర్‌పీసీ సెక్షన్ 151ను ఉపయోగించి పిటిషనర్ కదలికలను అడ్డుకోవడానికి వీల్లేదన్నారు.
కోర్టు జోక్యం చేసుకొని పోలీసులను నిలువరించకపోతే మరోసారి నిర్బంధించే అవకాశం ఉందన్నారు. సీఆర్‌పీసీ 151 నోటీసులు, గృహనిర్బంధ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. పిటిషనర్ స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకునే విషయంలో అడ్డంకులు సృష్టించొద్దన్నారు.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.