విమానం టేకాఫ్ అయిన తర్వాత.. తన బ్యాగులో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు హడలిపోగా.. అత్యవసరంగా విమానాన్ని మార్గమధ్యంలో దారి మళ్లించి మరో విమానాశ్రయంలో దింపాల్సి వచ్చింది. ఈ ఘటన పుణే-ఢిల్లీ ఆకాశ్ ఎయిర్‌లైన్ విమానంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మొత్తం 185 మంది ప్రయాణికులతో పుణే నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని.. ప్రయాణికుడి బెదిరింపులతో ముంయి విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. అనంతరం తనిఖీలు నిర్వహించగా.. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు అతడి బ్యాగులో లభ్యం కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌కు సమాచారం అందించడంతో బెదిరింపులకు పాల్పడిన ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాఫ్తు చేపట్టారు. ప్రయాణికుడు మానసిక స్థితిని అంచనా వేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పుణే నుంచి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత నిందితుడు తన బ్యాగులో బాంబు ఉందంటూ బెదిరించాడని అధికారులు తెలిపారు. విమానంలో సిబ్బంది సహా మొత్తం 191 మంది ఉన్నారని, భద్రతాపరమైన హెచ్చరికలతో వెంటనే ముంబయికి మళ్లించామని చెప్పారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత తనిఖీలు నిర్వహించామని, ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని ఆకాశ్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. విమానం తిరిగి ఉదయం 6 గంటలకు ముంబయి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లిందన్నారు.
‘ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటలకు సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు ముంబయి పోలీస్ కంట్రోల్‌కి సమాచారం అందించారు.. ఆ తర్వాత ఆ విమానంలోని ప్రయాణికుడి సామాన్లను బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ (BDDS) బృందం.. పోలీసు అధికారుల సమక్షంలో తనిఖీ చేశారు.. అయితే పోలీసుల విచారణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు’ అని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. బ్యాగులో బాంబు ఉందని ప్రయాణికుడికి తనకు ఛాతీనొప్పి ఉందని చెప్పడంతో ముంబయి విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛాతీ నొప్పికి మందులు వేసుకున్నట్టు ప్రయాణికుడితో పాటు ఉన్న అతడి బంధువు పోలీసులకు తెలిపాడు.