పెంపుడు కుక్కలను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. వేలకు వేలు పెట్టి రకరకాల బ్రీడ్‌లకు చెందిన శునకాలను తీసుకువచ్చి అల్లారుముద్దుగా పెంచుకుంటారు. వాటిని ఇంట్లో చిన్న పిల్లల లాగే చూస్తారు. అలాంటి పెంపుడు కుక్కలకు ఏదైనా చిన్న ఆపద వస్తే.. దాని యజమానులు తట్టుకోలేరు. అలాంటిది ఆ పెంపుడు శునకాన్ని ఎవరైనా చంపేస్తే. ఊహించడానికే కష్టంగా ఉంది కదా. అలాంటి సంఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో చూసి ఆ పెంపుడు కుక్క యజమానే కాకుండా జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్ నగరంలో ఈ క్రూరమైన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న సహారా స్టేట్ కాలనీలో ఉండే ఆల్ఫా ట్రైనింగ్ అండ్ బోర్డింగ్ సెంటర్ అనే కుక్కల శిక్షణ కేంద్రం ఉంది. నీలేష్ జైశ్వాల్ అనే ఓ బిజినెస్‌మెన్ కూడా తన పెంపుడు కుక్కకు ట్రైనింగ్ ఇప్పించడం కోసం.. ఆ కుక్కల ట్రైనింగ్ సెంటర్‌లో చేర్పించాడు. కుక్కకు శిక్షణ ఇచ్చేందుకు నెలకు రూ.13 వేల చొప్పున 4 నెలల పాటు డబ్బులు కూడా కట్టాడు. 4 నెలల తర్వాత కుక్క చనిపోయిందని ఆ ట్రైనింగ్ సెంటర్ వాళ్లు.. నీలేష్ జైశ్వాల్‌కు ఫోన్ చేసి చెప్పడంతో అతడు అక్కడికి వెళ్లాడు. దీంతో నీలేష్‌కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నీలేష్ జైశ్వాల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజీ చూడగా.. వారు అడ్డంగా బుక్ అయ్యారు.
డాగ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కుక్కను బయటికి తీసుకువచ్చి.. గేటుకు ఉరివేసినట్లు స్పష్టంగా వీడియోలో కనిపించింది. అక్టోబర్ 12 వ తేదీ మధ్యాహ్నం కుక్క మెడకు తాడు బిగించి.. గేటుకు ఉరి వేశారు. దాదాపు 7 నిమిషాల పాటు ఆ కుక్క గిలగిలా కొట్టుకుని.. అరుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఆ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ డాగ్ ట్రైనింగ్ సెంటర్‌లో పని చేసే ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారిపై జంతు సంరక్షణ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పెంపుడు కుక్కను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక నోరు లేని జీవిని అంత క్రూరంగా చంపటంపై నెటిజన్లు, జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుక్కకు ట్రైనింగ్ ఇవ్వలేకపోతే.. దాని ఓనర్‌ను పిలిచి అప్పగించొచ్చు కదా.. దాని కోసం చంపడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.