వాహనదారులు ట్రాఫిక్ పోలీసులను చూస్తేనే భయపడిపోతారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించారని ఎక్కడ ట్రాఫిక్ సిబ్బంది ఫోటో కొట్టి చలాన్ వేస్తారోనని రోడ్డు ఎక్కాలంటేనే వణికిపోతారు. ఇంకా కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా అడ్డదారుల్లో పారిపోతూ ఉంటారు. మరి కొందరు మాత్రం వారి చేతికి చిక్కి జేబులు గుల్ల చేసుకుంటారు. అయితే పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను మాఫీ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 3 ఏళ్ల పాటు ఉన్న ట్రాఫిక్ చలాన్లు ఇక కట్టాల్సిన అవసరం లేదు అంటూ తాజాగా సరికొత్త ఆదేశాలు వెలువరించింది. దీంతో దాదాపు 18 లక్షల ట్రాఫిక్ చలాన్లు కట్టాల్సిన పని లేదని స్పష్టం చేసింది.
అయితే ఈ ట్రాఫిక్ చలాన్ల మాఫీ మన రాష్ట్రంలో కాదు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో. నోయిడా పరిధిలో పెండింగ్‌లో ఉన్న దాదాపు 18 లక్షల ట్రాఫిక్ చలాన్లను మాఫీ చేస్తూ.. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో 2018 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 2021 డిసెంబర్ 31 వ తేదీ మధ్య నమోదైన ట్రాఫిక్ చలాన్‌లను వాహనదారులు కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2018 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 2021 డిసెంబర్ 31 వ తేదీ మధ్య మొత్తం 17,89,463 ట్రాఫిక్ చలాన్లను వాహనదారులపై వేశారు. యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో డెలివరీ బాయ్స్, టాక్సీ డ్రైవర్లు, రోజూ ఆఫీస్‌లు, కాలేజ్‌లకు వెళ్లే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2018 నుంచి 2021 వరకు విధించిన ట్రాఫిక్ చలాన్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది. దానికి సంబంధించిన డాటాను కూడా త్వరలోనే ఈ-చలాన్ పోర్టల్ నుంచి తీసివేస్తామని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే 2018 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 2021 డిసెంబర్ 31 వ తేదీ మధ్య పడిన ట్రాఫిక్ చలాన్లను ఇప్పటికే సంబంధిత వాహనదారులు చెల్లించినట్లయితే వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాంటి వారి కోసం వారు కట్టిన డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదని పేర్కొంది. అయితే ఈ 3 ఏళ్ల వ్యవధిలో 7 లక్షల మంది వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ఈ-చలాన్‌లను చెల్లించినట్లు ట్రాఫిక్ విభాగం వెల్లడించింది. కేవలం చెల్లించని వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను మాఫీ చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో కూడా 2016 డిసెంబర్ నుంచి.. 2021 డిసెంబర్ మధ్య వాహనాలపై విధించిన ట్రాఫిక్ చలాన్లను రద్దు చేశారు. ఆ సమయంలో దాదాపు 30 వేల చలాన్‌లు కట్టాల్సిన అవసరం లేదని యూపీ సర్కార్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రస్తుతం మాఫీ చేసిన ట్రాఫిక్ చలాన్లే అధికమైనవి.