ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీలు, నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణమే. కొన్నిసార్లు ఆ విమర్శలు వ్యక్తిగతంగా కూడా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థులను దెబ్బకొట్టి వారికి పడే ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు, అందరు అభ్యర్థులు.. అవతలి వారిపై అనేక ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఏకంగా ముఖ్యమంత్రే.. ప్రతిపక్ష నేతపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రత్యర్థిపై వచ్చిన కొన్ని ఆరోపణలను సమర్థించిన సీఎం.. ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
మధ్యప్రదేశ్‌లో ఈసారి ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీలు.. అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్‌పై సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో గెలిచేందుకు కమల్‌నాథ్.. క్షుద్ర పూజలు చేస్తున్నట్లు వార్తలు తెగ వైరల్ అయ్యాయి.
ఉజ్జయినిలోని ఓ శ్మశానంలో ఉండే ఓ తాంత్రికుడు.. కమల్‌నాథ్ ఫోటో ఎదురుగా పెట్టుకుని నిమ్మకాయలు, పూలు, కుంకుమ, పసుపు, క్షుద్రపూజలకు కావాల్సిన సామగ్రితో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కావాలనే కమల్‌నాథ్ క్షుద్ర పూజలు చేయిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి పీఠం కోసమే కమల్‌నాథ్ ఈ పూజలు జరిపిస్తున్నట్లు తాంత్రిక పూజారి భయ్యూ మహరాజ్ ఓ టీవీ ఛానల్ ప్రతినిధికి చెప్పినట్లు కూడా వార్తలు వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా స్పందించారు. ఎవరైనా భక్తి మార్గంలో లేదా ఆధ్యాత్మిక మార్గంలో మునిగిపోవాలని భావిస్తారు. దాన్ని మనస్ఫూర్తిగా.. ధర్మబద్ధంగా జరుపుకోవాలి కానీ ఇలా క్షుద్రపూజలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆ ఫోటో చూస్తే ఆశ్చర్యమేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టిన తర్వాత తాము చేసిన పనులు, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. వారి ఓట్లను పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవలు చేసి వారి విశ్వాసాన్ని గెలుచుకోవాలని.. ప్రజలకు సేవ చేయడానికి ఇదే ఏకైక మార్గమని పేర్కొన్నారు. కానీ కొంతమంది మాత్రం శ్మశానవాటికలో తాంత్రిక పూజలు చేస్తున్నారని.. అలాంటి వాటితో రాష్ట్రానికి, దేశానికి, ప్రజలకు ఏదైనా ప్రయోజనం ఉందా అని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు.