భూ తగాదాల కారణంగా సోదరుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన రాజస్థాన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. చిన్నగా ప్రారంభమైన గొడవ కాస్త పెద్దదిగా మారి చంపుకునే వరకు వెళ్లింది. భూమి తమది అంటే తమది అని గొడవ పడ్డ సోదరుల కుటుంబాలు ఓ వ్యక్తిని బలిగొనగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మొదట తుపాకీతో కాల్చడంతో ఓ వ్యక్తి కింద పడిపోయాడు. అనంతరం పడిపోయిన వ్యక్తిపైకి అతని సోదరుడు అతి కిరాతకంగా ప్రవర్తించాడు. ట్రాక్టర్‌తో పలు మార్లు తొక్కించి చంపేశాడు. ఇప్పుడు ఈ ఘటన ప్రస్తుతం రాజస్థాన్ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బహదూర్ సింగ్, అతర్ సింగ్ అనే ఇద్దరు సోదరుల కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూమి విషయంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం రోజు ఉదయం బహదూర్ సింగ్ కుటుంబం ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు వివాదాస్పదంగా ఉన్న భూమి వద్దకు చేరుకుంది. అయితే ఈ విషయం తెలిసిన అతర్ సింగ్ కుటుంబం కొద్దిసేపటికే అక్కడికి వచ్చింది. మొదట మాటా మాటా అనుకున్న ఇరు కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
అయితే అదే సమయంలోనే సంఘటనా స్థలంలో తుపాకీ శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ క్రమంలో అతర్ సింగ్ కుమారుల్లో ఒకరైన నిర్పత్ నేలపై పడిపోయాడు. నిర్పత్ చనిపోయే దాకా నిందితుడు దామోదర్ ట్రాక్టర్‌తో అతన్ని తొక్కించాడు. అయితే రెండు కుటుంబాలకు చెందిన వారు వద్దు అని వారించినప్పటికీ నిందితుడు దామోదర్ ట్రాక్టర్ ఆపకుండా 8 సార్లు తొక్కించాడు. దీంతో నిర్ఫత్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటనలోనే దాదాపుగా 10 మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఈ ఘటన జరగడానికి ఐదు రోజుల ముందు కూడా ఇలాగే ఆ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగినట్లు స్థానికులు వెల్లడించారు. ఆ సమయంలో బహదూర్ సింగ్, అతని తమ్ముడు జనాక్‌పై అతర్ సింగ్, అతని కొడుకు నిర్పత్ దాడి చేశారని పేర్కొన్నారు. దానికి ప్రతీకారంగానే కోపంతో రగిలిపోయిన దామోదర్ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని భావిస్తున్నారు. అప్పుడు జరిగిన ఘటనపై కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది.