ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు రక్త మార్పిడి సమయంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యం కారణంగా వారు ప్రాణాంతక వ్యాధులకు గురైనట్లు తెలుస్తోంది. 14 మంది చిన్నారుల్లో కొందరికి హెచ్‌ఐవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సీ సోకినట్లు వార్తలు వెలువడటం సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అయితే ఈ ఆరోపణలను సదరు ఆస్పత్రి వర్గాలు కొట్టిపారేశాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన లాలా లజపతిరాయ్ ఆస్పత్రిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 14 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతూ లాలా లజపతిరాయ్ ఆస్పత్రికి వచ్చారు. అయితే వారికి ఎప్పటికప్పుడు రక్తమార్పిడి అవసరం కావడంతో ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ 14 మంది చిన్నారుల వయసు 6 నుంచి 16 ఏళ్ల లోపే ఉంటుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. వీరికి కలుషితం అయిన రక్తం ఎక్కించినట్లు విస్తృతంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆ 14 మంది చిన్నారుల్లో ఏడుగురికి హెపటైటిస్ బీ, ఐదుగురికి హైపటైటిస్ సీ, ఇద్దరికి హెచ్‌ఐవీ సోకినట్లు డాక్టర్లు గుర్తించినట్లు వార్తలు బయటికి వచ్చాయి. దీంతో ఇప్పటికే తలసేమియాతో బాధపడుతున్న ఆ చిన్నారులకు తాజాగా ఈ భయంకరమైన వైరస్‌లు సోకడంతో ఆస్పత్రి వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అత్యవసర సమయాల్లో పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తం ఎక్కించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్లు సోకడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు కాన్పూర్ మెడికల్ అధికారులు తెలిపారు.
అయితే ఈ ఆరోపణలను గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖండించారు. 2019 తర్వాత ఏ తలసేమియా రోగిలో కూడా హెచ్‌ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లు ఆస్పత్రిలో గుర్తించలేదని ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ కలా తెలిపారు. అయితే ఇలాంటి పుకార్లను ఆ ఆస్పత్రిలోని ఒక డాక్టర్ వ్యాప్తి చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. ఆ డాక్టర్‌ను అరుణ్ కుమార్ ఆర్యగా గుర్తించామని అతనిపై విచారణకు ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు.
చిన్నారులకు ప్రాణాంతక వైరస్‌లు సోకాయని వస్తున్న వార్తలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ సర్కార్.. ఉత్తర్‌ప్రదేశ్ ఆరోగ్య వ్యవస్థను మరింత అనారోగ్యంగా మార్చిందని మండిపడ్డారు. ఇంతటి దారుణమైన నిర్లక్ష్య వైఖరి సిగ్గుచేటు అని.. బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ క్షమించరాని నేరానికి అమాయక పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఇక యూపీలోని ప్రజల ఆరోగ్యంపై ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.