టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారుల ద్వారా ఈ లేఖను న్యాయమూర్తికి పంపారు. ఈ నెల 25న జడ్జికి టీడీపీ అధినేత లేఖ రాశారు. తన భద్రతపై అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేస్తూ చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు.. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు 'జైల్ చుట్టూ జరుగుతున్న పరిణామాలను మీ దృష్టికి తీసుకొద్దామనుకుంటున్నాను. నాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కూడా ఉంది. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. నాకు సెప్టెంబర్ 10న రిమాండ్ విధించడంతో.. అదే రోజు రాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నేను జైల్లో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో అధికార పార్టీకి సంబంధించినవాళ్లు పోస్ట్ చేశారు. ఇలా నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. పోలీసులే ఈ ఫుటేజ్‌ను విడుదల చేశారు. ఇలా చేయడం ద్వారా నా భద్రతాపరమైన అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి'అన్నారు.
'నా హత్యకు జరుగుతున్న కుట్రపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ కూడా వచ్చింది.. కోట్లాది రూపాయలు కూడా చేతులు మారాయి. ఇంత జరిగినా సరే.. ఈ లేఖ వ్యవహారంపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయలేదు. అలాగే ఎస్ కోట ఓ తీవ్రమైన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న పెన్ కెమెరా ద్వారా జైలు లోపల ఖైదీల వీడియోలను రికార్డ్ చేస్తున్నట్లు నాకు తెలిసింది. అలాగే ఓ డ్రోన్ సాయంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న నా కదలికల్ని పసిగట్టేందుకు ప్రయత్నించారు. ఈ డ్రోన్ ఓపెన్ జైల్ సమీపంలో కొందరు ఖైదీలు గుర్తంచారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేయలేదు. దీని వెనుక ఎవరున్నారో తేల్చలేదు. ఈ విషయంలో జైలు అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి' అని లేఖలో ప్రస్తావించారు.
'అంతేకాదు జైల్లో గుర్తు తెలియని వ్యక్తులు గంజాయి ప్యాకెట్లను విసిరారు. గార్డెనింగ్ పనుల్లో ఉన్న కొందరు ఖైదీలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ జైల్లో 2,200మంది ఉన్నారు.. 750మంది తీవ్రమైన నేరాలు చేసిన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్లే ఉన్నారు. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉంది. వారి నుంచి నాకు ముప్పు పొంచి ఉంది. అంతేకాదు మరో డ్రోన్ ఈ నెల 6న రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ మెయిన్ గేట్ దగ్గర ఎగిరింది.. అదే సమయంలో జైల్లో నాతో ములాఖత్ తర్వాత నా కుటుంబ సభ్యులు బయటకు వస్తున్నారు. ఆ డ్రోన్ ద్వారా వారి ఫోటోలను కూడా సేకరించారు. ఈ ఘటన వల్ల నాతో పాటూ నా కుటుంబానికి కూడా ముప్పు ఉందని అర్థమవుతుంది' అన్నారు.
'గత నాలుగున్నరేళ్లగా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. అందుకు అధికార పార్టీ కేడర్, నేతలు పోలీసుల సాయంతో నాపై పలు సందర్భాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంంలో కొన్ని ఘటనలను గుర్తు చేయదలచుకున్నాను. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే (2019 జూన్‌లో) నా భద్రతను తగ్గించారు. కానీ హైకోర్టు ఆదేశాలతో మళ్లీ భద్రతను పెంచారు. 2019 నవంబర్‌లో అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు వెళుతుంటే.. అధికార పార్టీ కార్యకర్తలు నేను ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రువ్వారు.. చెప్పులు విసిరారు. ఈ ఘటనపై అప్పటి డీజీపీ స్పందించారని.. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపడం హక్కు అంటూ వ్యాఖ్యానించారు.
'2022 నవంబర్‌లో నేను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పర్యటనకు వెళ్లాను.. అక్కడ కూడా నాపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 21న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పర్యటనకు వెళ్లిన సమయంలో కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఎన్ఎస్‌జీ కమాండోలకు గాయాలు అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 4న ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పరిశీలించేందుకు అన్నమయ్య జిల్లాకు వెళ్లాను.. ఆ సమయంలో అంగళ్లు సెంటర్‌లో కొందరు నల్ల చొక్కాలతో నిరసన చేశారు. అక్కడ తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. అక్కడ కేడర్‌పై దాడి కూడా జరిగింది.. అయితే ఈ ఘటనలో తిరిగి నాతో సహా టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు'
'అంగళ్లు కేసు విషయానికి వస్తే.. నా కాన్వాయ్‌ను పోలీసులు భీమగానిపల్లె దగ్గరే పోలీసులు నిలిపివేశారు. పుంగనూరు పట్టణంలోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత పరిణామాలతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వంలాదిమందిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అధికార పార్టీ ఇలా ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తోంది. ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు తెలిపినా సరే టార్గెట్ చేస్తున్నారు. ఆయా సందర్భాల్లో మేము కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం.. కానీ పట్టించుకోలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనలన్నీ సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే జరిగాయి. ఈ ఘటనల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.. జైలుతో పాటూ బయట భద్రతాపరమైన అంశాలను పరిశీలించాలని కోరుతున్నాను'అన్నారు.