ఏపీతో పాటూ దేశమంతటా టమాటా ధరలు చుక్కలు చూపించాయి. కేజీ ధర ఏకంగా రూ.150 నుంచి 200 వరకు వెళ్లింది. ఆ తర్వాత రేట్లు దిగిరావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టమాటా ధరల గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. తాజాగా ఉల్లి ధరలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఏపీలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. జూన్, జులై నెలల్లో కిలో రూ.20 నుంచి రూ.25 ఉంటే.. ఆగస్టు, సెప్టెంబరులో కిలో రూ.35 వరకు పలికింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.40 నుంచి రూ.60లు పలుకుతోంది.
ఉల్లి సాగయ్యే జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే టాప్.. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఉల్లి ఎగుమతయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. గతేడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు కర్నూలు మార్కెట్‌కు 1.95 లక్షల క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు రాగా.. ప్రస్తుతం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కేవలం 70,377 క్వింటాళ్లే వచ్చింది. ఆగస్టు, సెప్టెంబరులో దిగుబడులు తగ్గిపోయాయి. దిగుబడి బాగా ఉన్నప్పుడు మహారాష్ట్రలోని నాసిక్, పుణె తదితర ప్రాంతాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాకు రోజుకు 6-8 లారీలు వచ్చేవి. గత కొన్నిరోజులుగా 2-3 లారీలకు మించి రావడం లేదు.
గతేడాది ఉల్లి దిగుబడులు భారీగా వచ్చినా.. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లికి ధర లేని కారణంగా సెస్సు రూపంలో మార్కెట్ కమిటీ రూ.కోటి మేర ఆదాయం కోల్పోయింది. ఈ ఏడాది ఉల్లి ధరలు బాగానే ఉన్నా.. దిగుబడులు తగ్గిపోవడంతో మార్కెట్ కమిటీ దాదాపు రూ.2 కోట్ల మేర ఆదాయం కోల్పోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 777 క్వింటాళ్ల ఉల్లి రాగా.. క్వింటా కనిష్ఠ ధర రూ.2,501, మధ్యస్థ ధర రూ.4,419, గరిష్ఠ ధర రూ.5,318 పలికింది.
కర్నూలు జిల్లాలో జూన్ నుంచి అక్టోబరు వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వానలు లేక.. ఇటు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో దిగుబడులపై ప్రభావం చూపింది. ఎకరాకు వంద ప్యాకెట్లు రావాల్సి ఉండగా 50 ప్యాకెట్లు రాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు సగటున 50 క్వింటాళ్లు వచ్చే ఉల్లి 25 క్వింటాళ్లకు పడిపోయింది. కర్నూలు జిల్లాలో ఇప్పుడు సరిపడా ఉల్లి నిల్వలు లేవు. అలాగే మహారాష్ట్రలో పంట చివరి దశకు చేరుకోవడం.. ఉన్న నిల్వలు తరిగిపోవడంతో గత కొద్ది రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.