పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. మరోవైపు తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంటోంది ఏపీ విపత్తుల సంస్థ. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ప్రకాశం జిల్లా పొదిలి, ఏలూరు, ఏలూరు జిల్లా పోలవరం, పల్నాడు జిల్లా జంగమేశ్వరపురం, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో తేలికపాటి వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదవుతోంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఉదయం 6 గంటలకే మొదలవుతున్న ఎండ వేడి సాయంత్రం వరకు కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో మాత్రం రాత్రివేళల్లో వాతావరణం చల్లగా మారుతోంది. పగలు మాత్రం ఎండ మండిపోతోంది.