విజయనగరం రైలు ప్రమాద ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పి.. తీవ్రంగా ధ్వంసమైనట్టు సీఎంకు ప్రాథమిక సమాచారం అందగా.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టాలన్నారు. క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలోని కొత్తవలస మండలం కంతకపల్లి వద్ద ఓవర్ హెడ్ కేబుల్ తెగిపోవటంతో.. విశాఖపట్నం- రాయగడ ప్యాసింజర్ రైలు నిలిచిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన పలాస ఎక్స్‌ప్రెస్.. ముందున్న రాయగడ ట్రైన్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో.. రాయగడ్ రైలులోని మూడు బోగీలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందినట్గు తెలుస్తుండగా... చాలా మంది ప్రయాణికులు తీవ్ర గాయపడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 14 అంబులెన్సులు ఘటనా స్థలికి చేరుకుని.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులతో పాటు దగ్గర్లోని హాస్పిటల్స్‌కు తరలిస్తున్నారు.