ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా బయట పడిన వైట్ హైడ్రోజన్ నిల్వలు,,,,,వాతావరణ సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయన్న సైంటిస్ట్‌లు

national |  Suryaa Desk  | Published : Mon, Oct 30, 2023, 10:38 PM

వైట్ హైడ్రోజన్. ప్రస్తుతం వాతావరణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు వైట్ హైడ్రోజన్ ఉన్నా.. భారీగా నిల్వలు లేవు. ఇండస్ట్రీలు, ల్యాబ్‌లలో మాత్రమే ఇప్పటివరకు వైట్ హైడ్రోజన్ తయారు చేసేవారు. దాని వల్ల భారీగా కాలుష్య కారకాలు విడుదల అయ్యేవి. అయితే ఇప్పుడు భూ గర్భంలో భారీగా వైట్ హైడ్రోజన్ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. ఈ వైట్ హైడ్రోజన్‌ కారణంగా ఎలాంటి కాలుష్యం చోటు చేసుకోంది. అందుకే దీన్ని గోల్డెన్ హైడ్రోజన్ అని కూడా పిలుస్తారు. ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు భూమి లోపల ఈ వైట్ హైడ్రోజన్‌ నిల్వలను కనుగొన్నారు.


వైట్ హైడ్రోజన్ నిల్వలను భారీగా కనుక్కోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. వాతావరణ సంక్షోభం నుంచి ప్రపంచాన్ని కాపాడటంలో ఇది చాలా ఉపయోగపడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వైట్ హైడ్రోజన్ సహజంగా సంభవించే పరమాణు హైడ్రోజన్. ఈ ఆవిష్కరణను ఫ్రాన్స్‌లోని నేషనల్ సెంటర్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ డైరెక్టర్లు జాక్వెస్ పిరోనాన్, ఫిలిప్ డి డోనాటో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. భూమి లోపల శిలాజ ఇంధనాల కోసం జాక్వెస్ పిరోనోన్, ఫిలిప్ డి డోనాటో.. పరిశోధనలు చేస్తున్నపుడు ఈ వైట్ హైడ్రోజన్ నిల్వలను కనుక్కున్నారు. అయితే వారు ఆ వైట్ హైడ్రోజన్‌ను గుర్తించినపుడు.. అది వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడుతుందని ఊహించలేదు.


ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈశాన్య ఫ్రాన్స్‌లోని లోరైన్ మైనింగ్ బేసిన్‌లో ఉన్న మీథేన్ పరిమాణాన్ని అంచనా వేశారు. నీటిలో కరిగిన వాయువులను విశ్లేషించేందుకు ప్రయత్నించగా.. ఆ సమయంలో వారు వైట్ హైడ్రోజన్ ఉందని వారు గ్రహించారు. భూమి నుంచి కొన్ని వందల మీటర్ల లోపల ఈ వైట్ హైడ్రోజన్‌ను కనుగొన్నారు. వైట్ హైడ్రోజన్‌ను గుర్తించడంతో వారికి ఆ పరిశోధనపై మరింత ఆసక్తి కలిగింది. దీంతో మరింత లోతుకు వెళ్లారు. భూమిలో 1100 మీటర్ల కింద 14 శాతం వైట్ హైడ్రోజన్ గుర్తించగా.. అక్కడి నుంచి మరికొంచెం కిందికి అంటే 1250 మీటర్ల లోపలికి వెళ్తే అది 20 శాతానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. అక్కడ వైట్‌ హైడ్రోజన్‌కు సంబంధించిన భారీ రిజర్వాయర్ ఉన్నట్లు కనుక్కున్నారు. ఆ ప్రాంతంలో 6 మిలియన్ల నుంచి 250 మిలియన్ మెట్రిక్ టన్నుల వైట్‌ హైడ్రోజన్ ఉండొచ్చని జాక్వెస్ పిరోనాన్, ఫిలిప్ డి డోనాటో అంచనా వేశారు.


ఈ వైట్ హైడ్రోజన్ నిల్వలు ఇప్పటివరకు కనుగొన్న అతిపెద్ద నిక్షేపాల్లో ఒకటి అని పిరోనాన్ చెప్పారు. అందుకే వైట్ హైడ్రోజన్‌ను సహజ బంగారం, భౌగోళిక హైడ్రోజన్ అని కూడా పిలుస్తారు. ఇది సహజంగా ఉత్పత్తి అవుతుందని.. వాతావరణానికి కూడా హాని చేయదని గుర్తించారు. వైట్ హైడ్రోజన్ సహజంగా ఏర్పడే పరమాణు హైడ్రోజన్ అని.. ఇది ల్యాబ్‌లలో, పరిశ్రమల్లో తయారు చేసిన హైడ్రోజన్‌తో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుందని తెలిపారు. వైట్‌ హైడ్రోజన్ కాకుండా బూడిద, గోధుమ, నలుపు హైడ్రోజన్ శిలాజ మూలాల నుంచి ఉత్పత్తి చేస్తారు. హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్ సహా ఇతర హానికరమైన గ్రీన్‌ హౌస్ వాయువులు విడుదలవుతాయి. వాటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది. అయితే ఈ వైట్ హైడ్రోజన్‌ను మళ్లీ వినియోగించుకోవచ్చని.. దీంతోపాటు ఈ హైడ్రోజన్ కాలుష్యాన్ని కూడా కలిగించదని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే దీన్ని వైట్ హైడ్రోజన్‌ అంటారు. దీనికితోడు వైట్ హైడ్రోజన్‌ను సేకరించి చాలా తక్కువ ఖర్చుతో మళ్లీ ఉపయోగించుకోవచ్చని.. ఇది ఒక ముఖ్యమైన శక్తి వనరుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.


లోరైన్‌లోని బొగ్గు గని కింద సహజ హైడ్రోజన్ నిల్వలు ప్రపంచంలోనే అతిపెద్దవని లోరైన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఉపయోగించుకునే హైడ్రోజన్‌ అని.. ఒకవేళ అదే జరిగితే కేవలం ఫ్రాన్స్ మాత్రమే కాకుండా అనేక దేశాల ఇంధన అవసరాలు సులువుగా తీరుతాయని పేర్కొన్నారు. ఇది వాతావరణ సంక్షోభంతో పోరాడుతున్న ప్రపంచ దేశాలకు పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వైట్ హైడ్రోజన్ నిల్వలు ఆ ప్రాంతంలో సమానంగా విస్తరించి ఉన్నాయా లేవా అనేది ఇంకా పరిశోధనలు జరపాల్సి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. పాడుబడిన బొగ్గు గనిలో 3 వేల మీటర్ల లోతుకు చేరుకోవడం ద్వారా మరింత పరిశోధనలు చేయాలని పేర్కొన్నారు. ఆ లోతులో ఎంత వైట్ హైడ్రోజన్ ఉందో నిర్ధారించుకోవచ్చని తెలిపారు. వచ్చే ఏడాది ఈ వైట్ హైడ్రోజన్ అన్వేషణ కోసం పెద్ద ఎత్తున పరిశోధనలు ప్రారంభమవుతాయని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com