ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌లో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్,,,,,24 ఏళ్లుగా భారత రహస్యాలు చేరవేత

national |  Suryaa Desk  | Published : Mon, Oct 30, 2023, 10:36 PM

అతనో కిరాణా దుకాణ వ్యాపారి. సరుకులు అమ్మడం అతని వృత్తి కాగా.. భారత దేశ రహస్యాలను మన శత్రుదేశమైన పాకిస్థాన్‌కు పంపించడం ప్రవృత్తి. భారత సైనిక కుటుంబాలకు చెందిన వారితో పరిచయాలు పెంచుకోవడం, సైనికుల సెల్‌ఫోన్లకు మాల్‌వేర్ పంపించి వారి వద్ద ఉన్న సున్నితమైన సమాచారం, వారి కదలికలను పసిగట్టి పాకిస్థాన్‌కు చేరవేయడం చేసేవాడు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చిన గుజరాత్ ఏటీఎస్ పోలీసులు లాభ్‌శంకర్ మహేశ్వరి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.


1999 లో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన లాభ్‌శంకర్ మహేశ్వరి.. ఇక్కడే స్థిరపడి భారత పౌరసత్వం కూడా తీసుకున్నట్లు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తెలిపారు. 55 ఏళ్ల లాభ్‌శంకర్ మహేశ్వరి ఆనంద్ జిల్లాలోని తపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. లాభ్‌శంకర్ మహేశ్వరి తరచూ పాక్ ఐఎస్ఐతో టచ్‌లో ఉండేవాడని గుర్తించారు. తన వాట్సాప్ నంబర్ నుంచి గుజరాత్‌లోని ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులకు డేంజరస్ మాల్‌వేర్‌ వైరస్ ఉండే మెసేజ్ లింకులను పంపించేవాడని పోలీసులు గుర్తించారు. సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఆ లింక్‌ను ఓపెన్ చేయగానే.. ఆ సెల్‌ఫోన్‌లలో ఉన్న సమాచారం మొత్తం హ్యాకర్లకు చేరుతుంది. ఫోన్‌లో ఎంత సమాచారం ఉన్నా చిన్న ఏపీకే ఫైల్‌ రూపంలోకి మార్చి తక్కువ డాటా ఉన్నా ఆ ఫైల్‌ను హ్యాకర్లకు అందిస్తుంది.


1999 లో మెడికల్ ట్రీట్‌మెంట్‌ కోసం పాక్ నుంచి భారత్‌కు వచ్చిన లాభ్‌శంకర్ మహేశ్వరి.. గుజరాత్‌లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే తారాపూర్‌కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక కిరాణా దుకాణం పెట్టుకుని ఇక్కడే భారత పౌరసత్వం కోసం 2002 లో దరఖాస్తు చేసుకోగా.. 2005 లో లభించింది. అయితే అతని తల్లిదండ్రులు పాకిస్తాన్‌లో ఉన్నారని.. అందుకే అక్కడికి వెళ్లాలని తరచూ చెప్తూ ఉండేవాడని అతనితో ఉన్న వారితో చెప్పేవాడు. కరోనా సమయంలో వ్యాపారంలో నష్టాలు రావడంతో కల్తీ చేశారని.. ఈ క్రమంలోనే అతనిపై ఒక ఫోర్జరీ కేసు కూడా నమోదైందని పేర్కొన్నారు.


ఆ సమయంలోనే పాకిస్తాన్‌లో ఉన్న తన ఆస్తులను అమ్మేసి.. గుజరాత్‌కు తీసుకువచ్చి వ్యాపారంలో పెట్టాలనుకున్నాడు. అందుకోసం 2022లో మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకుని.. 45 రోజులు పాకిస్తాన్ వెళ్లొచ్చాడని స్థానికులు చెప్పారు. అయితే అతను పాకిస్తానీ గూఢచారి అని తమకు తెలియదని తాజాగా పాక్ గూఢచర్యం కేసులో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేయడంతో విషయం తెలిసిందని తెలిపారు. గతంలో పాకిస్తాన్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదని.. ఈ క్రమంలోనే 2022 లో పాకిస్తాన్‌లో ఉంటున్న తన బంధువులకు ఫోన్ చేసి వీసా త్వరగా వచ్చేలా చూడాలని తెలిపాడు. ఇందు కోసం పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఒక వ్యక్తిని కలవమని తన బంధువులకు చెప్పిన తర్వాతే అతనికి వీసా వచ్చిందని స్థానికులు తెలిపారు. అయితే గుజరాత్ వ్యక్తి పేరు మీద ఒక సిమ్ కార్డు కొని.. దాన్ని పాకిస్థాన్ పంపించారని.. ఆ నంబర్ మీద వాట్సాప్ ఓపెన్ చేసి దాని ఓటీపీని పాకిస్థాన్‌లో వీసా రావడానికి సాయపడిన పాక్ రాయబార కార్యాలయంలోని వ్యక్తికి పంపించినట్లు గుజరాత్ ఏటీఎస్ పోలీసులు గుర్తించారు.


అయితే ఆ నంబర్ నుంచి ఇండియన్ ఆర్మీ సిబ్బందికి ఫోన్లు చేయడం ప్రారంభించారని.. వారి పిల్లలు చదువుకుంటున్న సైనిక్ స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు చెప్పారు. స్కూల్‌లో కొత్త రూల్స్, పిల్లలకు స్కాలర్‌షిప్స్‌ కోసం దరఖాస్తులు నింపాలని మాల్‌వేర్‌తో కూడిన ఏపీకే ఫైల్స్ వారికి పంపి వాటి ద్వారా వారి దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ పేరుతో ఇండియన్ ఆర్మీ సిబ్బందికి లింకులు పంపించి కూడా వైరస్‌ను వారి ఫోన్లలోకి పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఆ మాల్‌వేర్ ఆర్మీ జవాన్ల ఫోన్‌లోకి వెళ్లిన తర్వాత వాట్సాప్ చాటింగ్‌లు, ఫోటోలు, వారి లొకేషన్ సహా అన్ని రకాల సమాచారం గుర్తించి పాకిస్థాన్‌ను పంపించినట్లు గుర్తించారు. ఈ విధంగా కార్గిల్ బోర్డర్‌లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ ఫోన్‌లోకి ఆ ‌వైరస్‌ను ఎక్కించడంతో భారత సైన్యం రహస్య సంభాషణలను పాకిస్తాన్‌కు చేర్చేందుకు ప్రయత్నించారని ఏటీఎస్ ఎస్పీ చెప్పారు. ఈ క్రమంలోనే ఆర్మీ ఇంటెలిజెన్స్‌తో కలిసి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి లాభ్‌శంకర్ మహేశ్వరిని తారాపూర్‌లో అరెస్టు చేశారు.


లాభ్‌శంకర్ మహేశ్వరిని తారాపూర్ కోర్టులో హాజరుపరచగా.. విచారణ కోసం 14 రోజులు కస్టడీకి అప్పగించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. లాభ్‌శంకర్‌ ఫోన్‌లో చాలా ఫోన్ నంబర్లు ఉన్నాయని.. అతను ఎవరితో మాట్లాడాడు.. సమాచారాన్ని ఎవరికి పంపించాడు.. అంత సులభంగా అతనికి సిమ్ కార్డులు ఎవరిస్తున్నారు అనే విషయాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని లాయర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే లాభ్‌శంకర్‌కు కోర్టు ఏడు రోజుల రిమాండ్ విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com