నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశంలోని ప్రధాన రైల్వే మార్గాల్లో పరుగులు పెడుతున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ కోచ్‌లు కూడా పట్టాలెక్కనున్నాయి. అయితే రిజర్వేషన్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల కోసం వందే సాధారణ్ రైళ్లను భారతీయ రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువస్తోంది. త్వరలోనే ఈ వందే సాధారణ్ రైళ్లు కూత పెట్టనున్నాయి. ఈ వారంలోనే ఈ వందే భారత్ సాధారణ్ రైళ్లకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే
వచ్చే వారం ఏర్పాటు చేయనున్న ట్రయల్ రన్ కోసం ఇప్పటికే వందే సాధారణ్ రైలు ముంబైలోని వాడి బండర్ యార్డ్‌కు చేరుకుంది. ఈ వందే సాధారణ్ రైలుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ వర్గాలు విడుదల చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారుతోంది. ఇక ఈ వందే సాధారణ్ తొలి రైలు దేశ రాజధాని ఢిల్లీ.. దేశ ఆర్థిక రాజధాని ముంబైల మధ్య నడవనుంది. దీని తర్వాత రెండో వందే సాధారణ్ రైలును ఎర్నాకుళం నుంచి గువాహటి మధ్య ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో ఐదు మార్గాల్లో ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మరో 30 మార్గాల్లో ఈ వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ వందే సాధారణ్ రైళ్లను కూడా వందే భారత్ రైళ్ల లాగే డిజైన్ చేశారు. ఈ రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉండగా.. అందులో 8 అన్ రిజర్వ్‌డ్ బోగీలు, 12 స్లీపర్ బోగీలు ఉంటాయి. ఇక మిగిలిన రెండు లోకో మోటివ్‌లు ఉంటాయి. పుష్ పుల్ విధానంలో ఈ వందే సాధారణ్ రైలు పని చేయనుంది. ఈ రైలులో ఒకేసారి 1800 మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవచ్చని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వందే సాధారణ్ రైలు గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు. అయితే వందే భారత్ రైళ్లతో పోల్చితే.. ఈ వందే సాధారణ్ రైళ్లలో ఏసీ కోచ్‌లు, ఆటోమేటిక్ డోర్‌లు ఉండవు. బోగీల లోపల అధునాతన సాంకేతికతో కూడిన వసతులు మాత్రం ఏర్పాటు చేశారు. మరోవైపు.. ఈ వందే సాధారణ్ రైలు కోచ్‌లను తమిళనాడులో తయారు చేశారు. పెరంబూరులో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ కోచ్‌లను డిజైన్ చేశారు. 3 విభిన్న సాంకేతికతలతో మొత్తం 400 వందల వందే సాధారణ్ కోచ్‌లను తయారు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.