దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. పార్టీలకు ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా వాదనలు అందించారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది విచారణను చేపట్టనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తన వాదనను లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఈ ఎన్నికల బాండ్ల పథకం కింద రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారి పూర్తి వివరాలు అత్యంత రహస్యంగా ఉంటాయని కేంద్రం తన సమాధానంలో వెల్లడించింది. అయితే సక్రమమైన మార్గాల్లో డబ్బును సమకూర్చుకునేందుకు రాజకీయ పార్టీలకు ఈ పథకం ఉపయోగపడుతుందని అందుకే దీన్ని తీసుకువచ్చినట్లు వివరించింది. టాక్స్ నియమాలను కూడా సక్రమంగా నెరవేర్చేలా చేస్తుందని పేర్కొంది. అందుకే ఎలాంటి నిబంధనలు, హక్కులను ఈ పథకం ఉల్లంఘించట్లేదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం.. అభ్యర్థుల పూర్వాపరాలను తెలుసుకునే హక్కు మాత్రమే ప్రజలకు ఉంటుందని.. అయితే ఇలాంటి విషయాలు తెలుసుకునే హక్కు వారికి లేదని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్ డొమైన్లలో ఉండదని.. రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు తెలుసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
అయితే ఎన్నికల బాండ్ల పథకంపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఇలా చెప్పడం ద్వారా పెద్ద పెద్ద కార్పొరేట్ల నుంచి బీజేపీ రహస్యంగా, కుట్రపూరితంగా విరాళాలను సేకరిస్తోందని ఇప్పుడు స్పష్టమైందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మండిపడ్డారు. చిన్న దాతల నుంచి డిజిటల్ లావాదేవీలతో పారదర్శకంగా విరాళాలు సేకరించే తమ పార్టీనే బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఈ బడా కార్పొరేట్లు గెలుస్తారా.. లేక రాజకీయ పార్టీలకు సహకరించే సామాన్య పౌరులు గెలుస్తారా చూద్దాం అని చిదంబరం సవాల్ విసిరారు
రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ 2018 లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని తెచ్చింది. అయితే పార్టీలు స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల బాండ్ల విధానంలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఈ పథకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.