హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లో మారణ హోమానికి తెరలేపింది. భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్ బలగాలు.. హమాస్ మిలిటెంట్లను అంతమొందించడమే లక్ష్యంగా భీకర పోరు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి హమాస్ ఉగ్రవాదులు చేసిన ఆకృత్యాలు ప్రపంచ దేశాల ముందు కదులుతూనే ఉన్నాయి. అయితే తన కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశారని ఓ జర్మన్ మహిళ తాజాగా తీవ్ర ఆగ్రహం వ్యక్ం చేశారు. తన కుమార్తెను బట్టలు లేకుండా నగరం చుట్టూ హమాస్ మిలిటెంట్లు ఊరేగించారని.. ఆ తర్వాత అత్యంత కిరాతకంగా చంపేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 7 వ తేదీన ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడిన హమాస్ ఉగ్రవాదులు.. ఆ తర్వాత భూభాగంలోకి చొరబడ్డారు. దొరికిన వారిని కాల్చి చంపుతూ మరికొందర్ని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేశారు. దక్షిణ ఇజ్రాయెల్‌లో జరిగిన సూపర్‌నోవా మ్యూజిక్ ఫెస్ట్‌కు హాజరైన పలువురు పౌరులను హమాస్ మిలిటెంట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఇందులో కొందరు విదేశీయులు కూడా ఉండటం తీవ్ర కలకలం రేపింది. అందులో భాగంగానే జర్మన్ యువతి షానీ లౌక్‌ను అపహరించిన హమాస్ ఉగ్రవాదులు.. ఆమె పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. షానీ లౌక్‌ను బట్టలు లేకుండా నగరం చుట్టూ ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రపంచ దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి.
ఈ క్రమంలోనే తన కుమార్తె చనిపోయినట్లు ఇజ్రాయెల్ సైన్యం తమకు సమాచారం అందించిందని షానీ లౌక్ తల్లి జర్మనీ మహిళ రికార్డా లౌక్ తెలిపారు. అయితే జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోదరి చనిపోయిందని షానీ లౌక్ సోదరి ఒక పోస్ట్ పెట్టారు.
అయితే తన కుమార్తె మొదట తీవ్రంగా గాయపడిందని.. ఆ తర్వాత గాజాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తమకు తెలిసిందని రికార్డా లౌక్ తెలిపారు. అయితే షానీ లౌక్‌కు జర్మనీ, ఇజ్రాయెల్ రెండు దేశాలకు చెందిన ద్వంద్వ పౌరసత్వం ఉందని.. అయితే ఆమె ఎప్పుడూ జర్మనీలో కాకుండా ఇజ్రాయెల్‌లోనే ఉండేదని పేర్కొన్నారు. కుటుంబం, బంధువులను కలిసేందుకు మాత్రమే జర్మనీకి వచ్చేదని చెప్పారు. మరోవైపు.. రికార్డా లౌక్ జర్మనీలోని కాథలిక్కులను విశ్వసిస్తుండగా.. షానీ లౌక్ మాత్రం ఇజ్రాయెల్‌కు వలస వెళ్లి జుడాయిజాన్ని అనుసరించడం ప్రారంభించిందని పేర్కొన్నారు.