ఎన్నికల తరుణంలో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించి వైయస్ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తాడేపల్లిలో మంగళవారం ఓటర్ల జాబితాలకు సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ నేతలకు వర్క్ షాప్ నిర్వహించారు. ముందుగా దివంగతనేత స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వర్కషాప్ కు ముఖ్యఅతిధిగా హాజరైన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రానున్న నాలుగు నెలలు ఓటర్ల జాబితాలకు సంబంధించి కీలకమైన రోజులని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రధ్ద వహించి పనిచేయాలన్నారు. ఓటర్ల చేర్పులకు సంభందించి ఇతర అంశాలపై ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు కల్పించడం, అనర్హులైన వారిని గుర్తించడం కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ఎటువంటి అనుమానాలున్నా కూడా నివృత్తి చేసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీకి అంకితభావంతో పనిచేసే వ్యక్తులను నియమించుకుని పోలింగ్ బూత్ లెవల్ నుంచి ఓట్లజాబితాలను పర్యవేక్షించేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ అందులో ఓటర్ల సంఖ్య దగ్గరనుంచి ఇటీవల జరిగిన మార్పులు చేర్పులను సరిచూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో అర్హులైన ఓటర్లందరికి ఓటు హక్కు కల్పించి తద్వారా జరిగే ఎన్నికలలో వారి మధ్దతు పొందాలన్నారు. ఆయా పోలింగ్ బూత్ లలో అర్హులైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించేవిధంగా పనిచేయాలని కోరారు. జేసిఎస్ కోఆర్డినేటర్లు,గృహసారధులు,పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు అందరి సహకారం తీసుకుని సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రత్యర్దిపార్టీలు దుష్ప్రచారం నేపధ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరం అన్నారు.