ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. అనంతరం జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ఉత్సవంగా అవతరణ వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొంటున్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. మరోవైపు ఢిల్లీలోని ఏపీ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.