విమానం నడిపే పైలట్లు, క్రూ సిబ్బంది మౌత్‌వాష్‌లు, టూత్ జెల్ లేదా ఆల్క్‌హాల్ శాతం అధికంగా ఉండే ఉత్పత్తులను వినియోగించొద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మార్గదర్శకాలు వెలువరించింది. తరచూ బ్రీత్ ఎనలైజర్ పరీక్షల నేపథ్యంలో మౌత్‌వాష్‌లలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉంటుంది కాబట్టి తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, విమాన సిబ్బంది ఆల్క్‌హాల్ వినియోగం విషయంలో వైద్య పరీక్షల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లోనూ మార్పులు చేసింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను డీజీసీఏ బుధవారం విడుదల చేసింది.
విమాన కార్యకలాపాల భద్రతను పెంపొందించడంతోపాటు మరింత ప్రభావవంతమైన చర్యల కోసం ఎప్పటికప్పుడు పరిశ్రమలు, వాటాదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ప్రస్తుత నిబంధనలను క్రమబద్ధీకరించి మద్యం సేవించే విమాన సిబ్బందికి వైద్య పరీక్షల ప్రక్రియపై పౌర విమానయాన అవసరాలు (సీఏఆర్)ను సవరించినట్లు డీజీసీఏ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే ముసాయిదాలో పేర్కొన్న సువాసన వెదజల్లే పెర్ఫ్యూమ్‌ను మాత్రం తుది మార్గదర్శకాల నుంచి తొలగించారు. ‘విమానయాన సిబ్బంది ఎటువంటి ఔషధాన్ని తీసుకోకూడదు. మౌత్‌వాష్, టూత్‌జెల్ వాడరాదు.. ఆల్కహాల్‌తో తయారైన ఉత్పత్తుల వల్ల బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌ల్లో పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. విమాన ప్రయాణ విధుల్లో పాల్గొనే వ్యక్తులెవరైనా ఔషధాలు తీసుకునే ముందు కంపెనీ వైద్యుడిని సంప్రదించాలి’ అని పేర్కొంది. డీజీసీఏ ప్రకారం ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో కూడిన బ్రీత్ ఎనలైజర్ పరికరాలు తప్పనిసరి. కాలిబ్రేషన్ ఏజెన్సీల పర్యవేక్షణ, నిఘా కోసం ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు.
‘బ్రీత్ ఎనలైజర్ కేసులను నివారించడానికి ఆపరేటింగ్ ఫ్లైట్ కోసం ప్రయాణికులతో పాాటు ప్రయాణించే సిబ్బంది బోర్డింగ్ స్టేషన్‌లో బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయించుకోవాలి’ అని స్పష్టం చేసింది. ఇతర అవసరాలతోపాటు సీజనల్ ట్రావెల్ కార్యకలాపాలలో నిమగ్నమైన ఆపరేటర్లు, నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేసింది. ‘విమానాశ్రయానికి చేరిన తర్వాత ఎవరైనా సిబ్బంది/ ట్రెయినీ పైలట్ అనారోగ్యం కారణంగా తన ఫ్లయింగ్ విధులను సురక్షితంగా నిర్వర్తించలేకపోతున్నారని భావిస్తే, సిబ్బంది తమ యాజమాన్యానికి తెలియజేస్తారు.. అలాంటి సందర్భంలో బ్రీత్-ఎనలైజర్ పరీక్ష నిర్వహించరాదు’ అని ఉద్ఘాటించింది. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న విమానయాన సంస్థలన్నీ బ్రీత్ ఎనలైజింగ్‌ను తప్పనిసరి చేశాయి. విమాన సర్వీసుల్లో పాల్గొనే పైలట్లు, సిబ్బందికి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆల్కహాల్ టెస్టు చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో మాత్రమే కొన్ని రోజులు మాత్రం ఈ తరహా పరీక్షలను నిలిపివేశారు.