తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. శనివారం (నవంబర్ 4) మధ్యాహ్నం పవన్ కళ్యాణ్.. నాదెండ్ల మనోహర్‌తో కలిసి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తన అరెస్టు సందర్భంగా పార్టీకి, కుటుంబసభ్యులకు అండగా నిలిచినందుకు పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టై, 52 రోజులు రాజమహేంద్రవరం (రాజమండ్రి) కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అక్టోబరు 31న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు నాయుడికి వైద్యులు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు గుండె, ఊపిరితిత్తులు, స్కిన్ అలర్జీకి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించారు. మరోవైపు.. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చంద్రబాబు నాయుడికి నేత్ర పరీక్షలతో పాటు సర్జరీ చేయించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.