రాష్ట్రంలో కరవు బారిన పడి లక్షలాది ఎకరాల్లో కళ్లముందే పంటలు ఎండిపోతున్నా కనీసం కేబినెట్ భేటీలో చర్చించకపోవడం జగన్ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనం అన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. 70శాతం మంది ఆధారపడిన వ్యవసాయం రంగం పట్ల జగన్ ఉదాసీన వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే ఏపీ సీఎంకు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవుతో ప్రజలు వలసబాట పడుతున్నది కనిపించడం లేదా? అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీరు అందక పడుతున్న అవస్థలపై కేబినెట్‌లో చర్చించే తీరిక కూడా లేదా? అన్నారు.
రైతుల బాధలు కేబినెట్‌లో చర్చించేంత ప్రధాన సమస్యగా వారికి కనిపించ లేదా? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో కరవు వల్ల రూ.30వేల కోట్ల నష్టం జరిగిందని కేంద్రానికి నివేదించగా.. ఇక్కడ వ్యవసాయ రంగంపై కనీస సమీక్ష కూడా లేకపోవడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, ఇరిగేషన్ మంత్రి దోచుకోవడం, చంద్రబాబుపై ఎలా అక్రమ కేసులు నమోదు చేయాలా అని కుట్రలు పన్నుతున్నారు తప్పితే.. రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు.
ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి జూలైలో రూ.500 కోట్లు విడుదల చేస్తే.. జగన్‌కు కనీసం పంటలు కాపాడటానికి, తాగునీటి వసతి కల్పనకు రూపాయి ఖర్చు చేయలేదన్నారు. కరవు తీవ్రంగా ఉంటే.. జగన్ రెడ్డి మొక్కుబడిగా 103 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకున్నారన్నారు. రాష్ట్రంలో కరవుకు ప్రజలు బలవడానికి, రైతులు, రైతు కూలీల వలసలకు జగన్ దోపిడీ పరిపాలనే కారణమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో రూ.68వేల కోట్లు ఖర్చు చేయగా.. జగన్ రెడ్డి రూ.25వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే లక్షలాది మంది పేదల వలసలు ఉండేవి కావన్నారు. పట్టిసీమను వట్టిసీమ అన్నారని.. ఇప్పుడు పట్టిసీమ నీరే ఆధారమైందన్నారు. పట్టిసీమపై నిందలు వేసినందుకు జగన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఇంతటి కరవు తాండివిస్తున్నా, పేద ప్రజలు అల్లాడుతున్నా కరవు సాయం ప్రకటించలేదన్నారు. కనీసం బోర్లలో నీరు వాడుకుందామన్నా.. కరెంట్ కోతలతో రైతులు అల్లాడుతున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో కరవును ఎదుర్కొనేందుకు ట్రాక్టర్లతో నీటి సరఫరా, రెయిన్ గన్లు, పంట కుంటలు ఏర్పాటు చేశామన్నారు. నేడు కరవు మండలాల ప్రకటనలోనూ మోసం చేస్తున్నారని.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షంపై చర్చించి రైతులను తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.